ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 8:09 PM IST

ETV Bharat / state

కర్నూలు జిల్లా కుడాలో భారీగా వెలుగు చూస్తున్న అక్రమ లేఅవుట్లు - KUDA Informal Layouts

KUDA Informal Layouts: అధికారం అండ చూసుకుని వైఎస్సార్సీపీ నేతలు ఐదేళ్లు రెచ్చిపోయారు. బాధ్యతగా ప్రవర్తించాల్సిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు స్తిరాస్థి వ్యాపారులతో కుమ్మక్కై జేబులు నింపుకున్నారు. ప్రభుత్వానికి మాత్రం చిల్లులు పెట్టారు. ప్రభుత్వం మారటంతో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భారీగా అనధికారిక లే అవుట్లు వెలుగుచూస్తున్నాయి.

KUDA_Informal_Layouts
KUDA_Informal_Layouts (ETV Bharat)

KUDA Informal Layouts:కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ- కుడా (KUDA) 2017లో ఏర్పడింది. మొదట 2,599 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో కర్నూలు నగరపాలక సంస్థ సహా నంద్యాల, డోన్, మున్సిపాలిటీలు, గూడూరు, బేతంచెర్ల నగర పంచాయతీల్లో 117 గ్రామాల పరిధిలో కుడాను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కుడా పరిధిని విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 53 మండలాలను కలుపుకొని 15,306 చదరపు కి.మీల విస్తీర్ణంలో 896 గ్రామాలను కుడా పరిధిలోకి తీసుకొచ్చారు.

కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, నంద్యాల, పాణ్యం పరిధిలోఅనుమతుల్లేని వెంచర్లు అత్యధికంగా ఉన్నాయి. ఆత్మకూరు, పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు, బేతంచెర్ల, బనగానపల్లి, ఆదోని, వెల్దుర్తి, పత్తికొండ, ఎమ్మిగనూరు పరిధిలో వెంచర్లు ఇష్టానుసారంగా వేశారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకుండా అప్పటి నాయకులు భరోసా ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఏదైనా వెంచరు వేస్తే కుడా అనుమతుల కోసం ఎకరాకు 70 వేల వరకు చలానా రూపంలో చెల్లించాలి. దీంతోపాటు వెంచర్‌లో పది శాతం ఖాళీ స్థలం వదలాలి. తప్పనిసరిగా 40 అడుగుల అప్రోచ్‌ రహదారి ఉండాలి. వెంచర్‌ వేసిన క్రమంలో కొన్ని ప్లాట్లను కుడా.. మార్ట్ గేజ్‌ చేసుకుంటుంది. వెంచర్‌లో రహదారులు, డ్రైనేజీలు ఇతరత్రా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. అలా చేయకుంటే వెంచరులో మార్టిగేజ్‌ చేసిన ప్లాట్లను విక్రయించి వెంచర్‌ను అభివృద్ధి చేసే బాధ్యత కుడాపై ఉంటుంది.

కాకాణి ఇలాకాలో అక్రమ లేఅవుట్లు - అనుమతి లేకున్నా ప్లాట్ల విక్రయం - YSRCP Leaders Illegal Layouts

కార్పొరేషన్ల పరిధిలో 25 సెంట్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 7.5 సెంట్లకుపైగా ఉంటే కుడా అనుమతి పొందాలి. జీ+5కు మించి భవనం నిర్మించాల్సి వస్తే డీటీసీపీ అనుమతి పొందాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నిబంధనలు ఎక్కడా అమలు చేయలేదు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనధికారిక లేఅవుట్లపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 472 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు 2020లో అధికారులు గుర్తించారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,715 ఎకరాల్లో 276, పట్టణ ప్రాంతాల్లో 1,800 ఎకరాల్లో 196 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో సరాసరిన 900 ఎకరాల్లో 300 వెంచర్ల వరకు అనుమతులిచ్చారు. మరో 284 అనధికారిక వెంచర్లకు తాఖీదులు ఇచ్చారు. వాస్తవానికి 5 వేల ఎకరాల్లో అనధికారిక వెంచర్లు వెలిశాయి. ఎకరా భూమి కొనుగోలు చేస్తే అందులో రహదారులు, ఖాళీ స్థలం, పార్కు ఇలా అన్నింటికి కలిపి 40 సెంట్ల స్థలం పోతుంది.

మిగిలిన 60 సెంట్ల స్థలంలో 2.75 సెంట్లు, 4, 5 సెంట్లు.. ఇలా ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారు. వీటికి కుడాకు అనుమతుల తీసుకుంటే సుమారు 25 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. నేతల అండదండలు ఉండటంతో ఐదేళ్లుగా అనుమతులు లేకుండానే వ్యాపారాలు సాగించారు. ప్రభుత్వం మారటంతో ఇప్పటికైనా అనధికారిక లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విచారణ జరిపిస్తే అక్రమ లే అవుట్లు వేసినవారికి కొమ్ముకాసి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టినవారి బాగోతం బయటపడుతుందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Illegal Layouts: ఎవడ్రా మనల్ని ఆపేది.. అక్రమ లేఅవుట్లతో రెచ్చిపోతున్న వైఎస్సార్​సీపీ నాయకులు

ABOUT THE AUTHOR

...view details