Indur Reveling in Beauty of Nature Nizamabad Dist : వాన చినుకులు పడుతుండగా పచ్చని ప్రకృతిలో ఎత్తైన కొండల మధ్య విహరిస్తే ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా! ప్రకృతి అందాలు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అరకు. అలాంటి ప్రకృతి అందాలే మన రాష్ట్రంలోనూ కనువిందుచేస్తున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు వాటి మధ్యలో గుట్టలు . మనసును హత్తుకునే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపు మేర భూమికి రంగేసినట్లు కనిపించే వివిధ రకాల ఉద్యాన పంటలు. వింటుంటూనే వెళ్లాలనిపిస్తోంది కదూ! అయితే పదండి మన ఇందూరు అందాలను వీక్షిద్దాం.
భూమికి పచ్చని రంగేసినట్టుగా గుట్టలు :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పకృతి అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. ఎటు చూసినా కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ మార్గంలో ప్రయాణం అరకు అనుభూతిని కలిగిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి గిరిజన తండాల్లో ప్రజలు గుట్టలను చదును చేసి పంటలు పండించడంతో ఎటు చూసినా పచ్చదనమే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ గుట్టలన్నీ భూమికి పచ్చని రంగేసినట్టుగానే కనిపిస్తున్నాయి. ఆ సోయగాన్ని చూసేకొద్దీ మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది.
ప్రకృతి అందాలను పరవశించేలా వృక్షాలు :నిజామాబాద్ జిల్లా మోపాల్, కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలాలకు వెళ్లే దారంతా ప్రకృతి రమణీయ దృశ్యాలే కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని గిరిజన తండాలు ఎత్తైన కొండల మధ్య ఉంటాయి. ఇక్కడ గిరిజనలు వివిధ రకాల ఆరు తడి పంటలను సాగు చేస్తుంటారు. ఇక పెద్ద పెద్ద వృక్షాలు ప్రకృతి అందాలను పరవశించేలా మైమరిపిస్తుంటాయి. ఈ దారి గుండా వెళ్తుంటే పకృతి రమణీయత స్వాగతం పలుకుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఇట్టే కట్టిపడేస్తుంటాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.