US Spelling Bee Champion 2024: అగ్రరాజ్యంగా పేరు పొందిన అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈ ఏడాది కూడా భారత అమెరికన్ విద్యార్థుల హవా కొనసాగింది. 2024 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ విజేతగా నిలిచాడు. 90 సెకన్లలో అబ్సెయిల్ సహా 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పి, కప్‌తో పాటు 50 వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు. ఫ్లోరిడాకు చెందిన బృహత్ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాస్ సోమ తెలంగాణలోని నల్గొండకు చెందిన వారు.
American Spelling Bee Competition: ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో 245 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 8 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇందులో బృహత్ సోమ, ఫైజన్ జాకీ మధ్య టై ఏర్పడింది. టై బ్రేకర్‌గా ఇద్దరికీ 90 సెకన్ల సమయాన్ని నిర్వాహకులు కేటాయించారు. ఇందులో జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా, బృహత్ 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ పొందాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22 పదాల స్పెల్లింగ్‌లు చెప్పగా, ఆ రికార్డును ప్రస్తుతం బృహత్ అధిగమించాడని నిర్వాహకులు తెలిపారు.
యూఎస్ 'స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఈసారీ మనదే జోరు.. హరిణికి టైటిల్