Indiramma House First Phase Filtration : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరి ఇళ్లకు సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ప్రతి దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. యాప్ సర్వేలు అర్హులేనని తేలినప్పుటికీ సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు వెల్లడైతే ఆ దరఖాస్తును పక్కన పెట్టేస్తారు. మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైనా వారికే ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలతోనూ పూర్తిస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. పూర్తి వడపోత తర్వాత ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ నెల 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామసభల్లో ఈ జాబితాను ప్రదర్శించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కాగా ఈ నెల 26లోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది.
గ్రామసభల్లో ప్రదర్శన : ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు, పట్టమాలు వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు కసర్తతు చేస్తున్నారు. మొత్తం 3,500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదిస్తారు. ఆనంతరం ఎన్ని మంజూరయ్యాయో ఆ వివరాలు గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. ఎంపికలో అతిపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తారు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.