India Facing Severe Water Crisis : మనుషులు సహా భూమిపై ఉన్న జీవరాశుల అవసరాలను తీర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం నీరు. అయితే అలాంటి గొప్ప వరం దక్కితే మనిషి మాత్రం తన స్వార్థానికి విచ్చలవిడిగా వాడేస్తూ తనకు తాను నీటి కొరతను సృష్టించుకున్నాడు. దొరుకుతోంది కదా అని పొదుపు అన్న మాటే మరిచి నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. బెంగళూరు సహా దేశంలోని అనేక నగరాలు నీటి కొరతతో సతమతం అవుతున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం.
ఇలాంటి పరిస్థితులు దేశంలో తరచూ ఉత్పన్నం అవుతుండగా, ప్రతిసారి ప్రస్తావనకు వచ్చే అంశం నీటి పొదుపు. బొట్టు బొట్టును ఒడిసిపట్టాలి, పొదుపుగా వాడాలి, ఇంకుడు గుంతలనుఏర్పాటు చేసుకోవాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టాలి అనే మాటలు కొరత తలెత్తిన ప్రతి సందర్భంలోనూ వినిపించేవే. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ నినాదాలు ఇవ్వడం, ప్రజలు ఆరంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం. ఇలాంటి సందర్భాలు ఇటీవల కాలంలో అనేకం తలెత్తాయి.
నీటి పొదుపు కోసం చిత్తశుద్ధితో ఏం చేయాలి? :మండుతున్న ఎండల్లో దేశంలోని అనేక ప్రాంతాలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్న నేపథ్యంలో నీటి పొదుపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తూతూ మంత్రం చర్యలు కాకుండా నీటి పొదుపు కోసం చిత్తశుద్ధితో ఏం చేయాలి, కొరతకు శాశ్వత పరిష్కారం ఏమిటి అనే అంశాలు ఇప్పుడు ప్రాధాన్యతా అంశాలుగా మారాయి. భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. ఇంతటి భారీ జనాభా అవసరాలను దేశంలోని నీటి వనరులు తీర్చలేకపోతున్నాయి.
ప్రపంచ మంచి నీటి వనరుల్లో భారత్‌కు 4శాతం మాత్రమే వాటా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. భారత్‌లోని ప్రతి ముగ్గురిలో ఒకరు నీటి కొరతతో సతమతం అవుతున్నారని నిపుణులు చెబుతున్న మాట. తాజా అధ్యయనం ప్రకారం 2050 నాటికి దేశంలోని సగం జిల్లాలు నీటి కొరతను ఎదుర్కోనున్నాయి.
Water Crisis in India :ఆ సమయానికి తలసరి నీటి లభ్యత 15శాతం తగ్గుతుందని అంచనా. అదే సమయంలో జల వనరుల డిమాండ్ 30శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. డిమాండ్-సరఫరాల మధ్య భారీ అంతరం ఏర్పడనుంది. ఫలితంగా నీటి ఎద్దడి మరింత తీవ్రతరమై నీటి కోసం గొడవలకు దిగే పరిస్థితి తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే నీటి పొదుపు తక్షణ అవసరంగా భావించి ప్రభుత్వాలు, ప్రజలు సహా ప్రతి ఒక్కరూ ఈ దిశగా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
వర్షపు నీటిని ఒడిసిపడదాం.. కరవు నుంచి బయటపడదాం - RAIN WATER HARVESTING IN HYDERABAD
దేశవ్యాప్తంగా ఉపరితల, భూగర్భ నీటి వనరుల కొరత అత్యంత తీవ్రంగా మారి, సంక్షోభ స్థాయికి చేరడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనాభా పెరగడం, అడ్డూ అదుపు లేని వినియోగం, వ్యవసాయంలో నీరు ఎక్కువ అవసరం ఉండే పంటల వైపు మొగ్గు చూపడం వంటి కారణాలతో నీటి వనరులపై ఒత్తిడి క్రమంగా పెరిగిపోతోంది. దేశంలో అత్యధిక జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. నీరు పరిమితంగా అందుబాటులో ఉండడం, దానిలోనూ 90శాతం నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి, గోధుమ, చెరకు వంటి పంటల సాగుకు వినియోగిస్తున్నారు.
నీటి పొదుపే నేటి జీవనాధారం : అసంబద్ధ నీటి నిర్వహణ, యాజమాన్య విధానాల వల్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ రంగంలో నీటి పొదుపును ప్రోత్సహించడానికి మరింత యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది. సూక్ష్మ నీటి సేద్యం, తుంపర, బిందు సేద్యం వంటి ఆధునిక పద్ధతులను తక్షణం అనుసరించాలని, లేకుంటే భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గృహ, పారిశ్రామిక అవసరాల్లో కూడా నీటి పొదుపును తక్షణ చర్యగా చేర్చాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వృథాను అరికట్టాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతున్నారు. మురుగు నీటిని శుద్ధి చేసి పునర్ వినియోగించుకునే సాంకేతికతను మరింత పెంపొందించుకోవాలి. ఇళ్ల నుంచి వెలువడే మురుగు, పారిశ్రామిక విష వ్యర్థాలు, మంచి నీటి వనరుల్లో చేరకుండా చర్యలు చేపట్టాలి. నీటి వనరుల పరీవాహక ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులను నిరాకరించాలి.