తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్‌ఆర్‌పై హడలెత్తిస్తున్న ప్రమాదాలు - అతి వేగం, అజాగ్రత్తే కారణం! - ఓఆర్‌ఆర్‌పై పెరుగుతున్న ప్రమాదాలు

Increasing Accidents in ORR : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఏడాదిలోనే 127 శాతం ప్రమాదాలు పెరిగాయి. ఓఆర్‌ఆర్‌లో ఒకవైపు 4, మరోవైపు 4 వరుసలున్నాయి. వాహనాదారులు ఒక వరుస నుంచి మరో వరుస మారే క్రమంలోనే ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటోంది.

Increasing Accidents in ORR
Increasing Accidents in ORR

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 10:36 AM IST

Increasing Accidents in ORR : హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారిని (ఓఆర్‌ఆర్‌) మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్ఠాత్మకంగా అత్యాధునికంగా నిర్మించారు. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాంతకంగా మారుతోంది. అత్యంత వేగంగా వెళ్లేందుకు అనువైన ఈ రహదారిపై రయ్ రయ్‌మంటూ దూసుకొస్తున్న వాహనాలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెప్పపాటులో మరణాలు సంభవిస్తున్నాయి. అంతకుముందు సంవత్సరం కంటే 2023లో ప్రమాదాలు 127 శాతం పెరిగాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) మరణం నేపథ్యంలో ఇప్పుడు మరోమారు ఓఆర్‌ఆర్‌ ప్రమాదాలపై చర్చ మొదలైంది.

రోజూ 1.5 లక్షల వాహనాల రాకపోకలు :హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఓఆర్‌ఆర్‌ యావత్‌ తెలంగాణకే తలమానికం. 8 వరుసల్లో నిర్మించిన ఈ రహదారిపై రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ప్రతిరోజూ దాదాపు 1.5 లక్షల వాహనాలు దీనిపై రాకపోకలు సాగిస్తున్నాయి. అత్యాధునికంగా నిర్మించిన ఈ రోడ్డుపై పలువురు అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలకు దారితీస్తోంది.

ORR Accidents Today : నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

ప్రాణం తీస్తున్న వేగం :ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమని చెప్పవచ్చు. ఇక్కడ గరిష్ఠంగా 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అయితే చాలా వాహనాలు ఏకంగా 140-160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయని పోలీసులే చెబుతున్నారు. అత్యధికంగా 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వాహనాన్నీ గుర్తించినట్లు పేర్కొన్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలపై కనీసం రోజుకు అధిక సంఖ్యలో కేసులు రాస్తున్నట్లు వివరించారు. ఇంత వేగంతో వాహనం వెళ్తున్నప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితిలో అదుపు చేయడం కష్టమవుతుందని తెలిపారు. శుక్రవారం లాస్య నందిత మరణానికి కూడా అతివేగమే కారణమని పోలీసులు అంటున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాలు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2022లో ఓఆర్‌ఆర్‌పై జరిగిన ప్రమాదాల్లో 170 మంది మరణించగా 2023 నాటికి ఆ సంఖ్య 216కి పెరిగింది.

ఇతర కారణాలు :

  • ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో పలువురు రాజకీయ నేతలు తమ భూముల పరిరక్షణ కోసం ఏకంగా దాదాపు వందసార్లు అలైన్‌మెంట్‌ను మార్చారు. ఫలితంగా ఈ రోడ్డు అనేక వంపులతో నిర్మితమైంది. ఈ వంపుల దగ్గర వాహనదారులు తాము నడుపుతున్న వాహనాన్ని నియంత్రించలేని పరిస్థితుల్లో పక్కనున్న రైలింగ్‌ను ఢీకొడుతున్నారు. ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
  • ఓఆర్‌ఆర్‌లో ఒకవైపు 4, మరోవైపు 4 వరుసలున్నాయి. ఒకవైపు మొదటి రెండు వరుసల్లో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. మిగిలిన 2 వరుసల్లో వాహనవేగం పరిమితి 80 కిలోమీటర్లు. ఈ లైన్ల గందరగోళంలోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. 120 కిలో మీటర్ల వేగంతో వెళ్లే వాహనాలు ఒక్కోసారి పక్కనే ఉన్న 80 కిలోమీటర్ల లైన్‌లోకి దూసుకొస్తుండటంతో అక్కడున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. కొందరు వాహనదారులు అవగాహన లేకుండా ఒక్కసారిగా 80 కిలోమీటర్ల లైన్ నుంచి 120 కిలో మీటర్ల లైనులోకి వెళ్తుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
  • బాహ్య వలయ రహదారిపై (Hyderabad ORR) లారీలు 80 కిలోమీటర్ల లైన్‌లోనే వెళ్లాలి. కానీ కొందరు డ్రైవర్లు 120 కిలోమీటర్ల లైన్‌లోకి వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరి కొన్నిసార్లు వేగంగా వెళ్లే లారీని అకస్మాత్తుగా నిలుపుతుండటం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
  • గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఓఆర్‌ఆర్‌లో వెళ్తున్న కొందరు వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్నిచోట్ల సర్వీస్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డులోకి వచ్చేటప్పుడు వాహనాల సిగ్నల్‌ వ్యవస్థను ఉపయోగించకుండా దూసుకురావడంతో కూడా ప్రమాదాలకు కారణంగా మారుతోంది. నడిపేవారి నిద్రలేమి వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
  • ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల నరికివేత ఇతరత్రా పనులు చేసేటప్పుడు తగిన హెచ్చరిక వ్యవస్థలను కూడా వినియోగించడం లేదు. అదే సమయంలో రోడ్డుపక్కన సిబ్బంది వాహనాలను నిలిపి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.

వసూళ్లులో ఘనం.. సౌకర్యాల్లో విఫలం.. ఇది ఔటర్​రింగ్​ రోడ్డు పరిస్థితి

ORR Accident: ఓఆర్​ఆర్​పై ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details