Road Safety Tips For Bike Riders :చాలావరకు దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే మరణిస్తున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలో ఈ వివరాలున్నాయి. మనలో చాలామంది వద్ద హెల్మెట్ ఉన్నా కూడా ధరించేందుకు ఇష్టపడరు. కొంతమందిలో హెల్మెట్ ధరించడంపై కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిలో వాస్తవమెంత? అనే విషయాన్ని తెలుసుకుందాం.
హెల్మెట్ వాడకంలో అపోహలు
- జుట్టు ఊడిపోతుందనే భయం
- పక్కన వాహనాలు కనిపించవు
- తలనొప్పి, మెడ నొప్పి వస్తుంది
- చెవులకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది
హెల్మెట్ వాడుతున్నప్పుడు జుట్టు ఊడకుండా ఉండాలంటే :ఎక్కువసమయం ధరించడం వల్ల వచ్చే చెమటతో తలపై జుట్టున్న భాగం అపరిశుభ్రంగా మారుతుంది. దీంతో చుండ్రు పెరగడం, దురదపెట్టడం, జుట్టు ఊడటం లాంటి సమస్యలొస్తాయి. హెల్మెట్ లోపలి భాగాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మంచి కాటన్ రుమాలును తలకు కట్టుకుని పై నుంచి హెల్మెట్ ధరించడం ఉత్తమం.
- మీ హెడ్కన్నా తక్కువ సైజ్ ఉన్న హెల్మెట్ ధరిస్తే బిగుతుగా ఉండి తలనొప్పి వచ్చే వీలుంది. శిరసు చుట్టుకొలత ఆధారంగా శిరస్త్రాణం కొనుగోలు చేయాలి.
- ఐఎస్‌ఐ ప్రమాణాలతో ఉన్న నాణ్యమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. సులభంగా తల తిప్పగలిగే సౌలభ్యం ఉండే హెల్మెట్నే తీసుకోవడం మంచింది.
- ఎక్కువ సేపు బైక్‌ను నడపడం గుంతలు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు వాహన వేగం తగ్గించకపోవడం వల్ల మెడ, వెన్ను నొప్పులు వచ్చే అవకాశముంది.
- సీటుపై ఒక పక్కకు వంగి కూర్చోవడం, బండి హ్యాండిల్‌ను సరిగ్గా లేకపోవడం వల్లా మెడ, వెన్ను నొప్పి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది.
- తలకు తగిలే గాయాలనుంచి కాపాడుకోవడంలో హెల్మెట్ పాత్ర 42 శాతం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.
ప్రతి వాహనదారుడికి హెల్మెట్ తప్పనిసరి :రూ.15- 20వేలు పెట్టి సెల్‌ఫోన్ కొంటేనే దానికి స్క్రీన్ గార్డు (రక్షణ తెర) వేయిస్తాం. అలాంటిది నిండు నూరేళ్లు బతకాలని కోరుకునేవారు బైక్‌పై వెళ్తుంటే శిరస్త్రాణాన్ని ఎందుకు ధరించకుండా వెళ్తున్నారో అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం?.