Rain Alert To Telangana :రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదారాబాద్, మహబూబ్ నగర్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయని తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా ఈ జిల్లాలకు వర్ష సూచన ఉన్నందున ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి :దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో కొనసాగుతున్న ప్రస్ఫుటమైన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో చెన్నైకి తూర్పు - ఆగ్నేయ దిశలో 320 కి. మీ.దూరంలో నెల్లూరుకి ఆగ్నేయ దిశలో 400 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 17వ తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని పుదుచ్చేరి - నెల్లూరు మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన చక్రవాతపు ఆవర్తనం ఈరోజు బలహీన పడినట్లు తెలిపింది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు :ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.