Illegal Hoardings Under GHMC Premises :పైవంతెనలపై ఉన్న హోర్డింగులు కంటి చూపు ఉన్న ప్రతి ఒక్కరికీ కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీకి మాత్రం కనిపించవు. సైబర్ టవర్స్ చౌరస్తా, బయో డైవర్సిటీ కూడలి పైవంతెనలపై ఇరువైపులా కలిపి నాలుగు అనుమతి లేని హోర్డింగులు నాలుగేళ్లుగా ఉన్నాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్, బషీర్‌బాగ్, ఆర్కేపురం పైవంతెనలకు రెండేసి చొప్పున, ఆర్‌కే పురం వంతెనకు ఒకటి కలిపి ఐదు హోర్డింగులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. కోర్టు కేసుల పేరుతో జీహెచ్‌ఎంసీ వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తోందన్న విమర్శలున్నాయి.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లోని విభాగినులపై లాలిపప్ ప్రకటన బోర్డుల ఏర్పాటుపై కేసునూ తేల్చట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు మారుతున్నా గానీ దాదాపు 15 ఏళ్లుగా ఆయా కేసులపై సరైన వాదనలు వినిపించి, పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దశాబ్ద కాలంగా కేసులు అపరిష్కృతం :రహదారులకు ఇరువైపులా, భవనాలపై, రోడ్డు విభాగినులపై ప్రకటనల బోర్డులను ఐదేళ్ల కిందటే ప్రభుత్వం నిషేధించింది. అయినా జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి రోడ్డు, లక్డీకాపూల్ నుంచి మాసబ్‌ట్యాంకు వెళ్లే రోడ్డు, ఐమాక్స్ రోడ్డు విభాగినులపై లాలిపప్ ప్రకటన బోర్డులు కనిపిస్తున్నాయి. బోర్డులపై అడిగితే వాటికి సంబంధించి కేసు విచారణలో ఉందని అధికారులు చెబుతున్నారు. మరో మూడు పైవంతెనలపై ఏర్పాటైన హోర్డింగులకూ అదే సమాధానం. ఆయా కేసులు దశాబ్ద కాలానికిపైగా అపరిష్కృతంగా ఉండటంతో బల్దియాపై విమర్శలొస్తున్నాయి.
పేరుకి మాత్రమే : ఒకప్పుడు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులకు చెందిన గొడుగుల్లాంటి నిర్మాణాలు కనిపించేవి. వాటిపై ప్రకటనలూ ఉండేవి. మా రోడ్లపై మీరు ప్రకటనలు ఏంటని 2020లో జీహెచ్‌ఎంసీ కొత్త విధానాన్ని తెచ్చింది. కూడళ్లలో పోలీసులకు చిన్న కార్యాలయం, కుర్చీలు, వైఫై, ఇతర సదుపాయాలతో కూడిన 700 ట్రాఫిక్ కేంద్రాలను ఏర్పాటుకు టెండర్లను పిలిచింది. యాడ్ ఏజెన్సీలు అరకొరగానే పెట్టాయి. 90శాతం గతంలో ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించుకున్నవే. ఒక్కో కేంద్రం నుంచి యాడ్ ఏజెన్సీలు నెలకు రూ.30వేల నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నాయి.