Break the Law you will go To Jail : సామాజికంగా, చట్టపరంగా, నైతికంగా ఏదైనా సరే. బాధ్యత అనేది పౌరులందరికీ తప్పనిసరి. అది విస్మరిస్తే చాలా ప్రమాదం. తల్లిదండ్రులు బాధ్యత మరిస్తే పిల్లలకే కాదు సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెడు పనులు చేసినా, అందుకు ప్రోత్సహించినా ఊచలు లెక్కపెట్టాల్సిందే.
పిల్లలకు వాహనాలు ఇస్తే : మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు మాత్రమే వాహనాలు నడపాలి. ఇలా కాకుండా మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. పిల్లలు వాహనం నడుపుతున్న క్రమంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మైనర్‌తోపాటు తల్లిదండ్రులు, వాహన యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. చట్ట ప్రకారం వీరికి పదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది.
బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా : యువతుల వివాహానికి చట్టబద్ధమైన వయసు పద్దెనిమిదేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఆ గడువుకు ముందు పెళ్లి చేస్తే దానిని బాల్య వివాహంగా పరిగిణిస్తారు. చట్ట ప్రకారం ఇది నేరం. ఆ బాలికను వివాహం చేసుకుంటే యువకుడికి శిక్ష పడుతుంది. ఇలాంటి వివాహాలను ప్రోత్సహించే వారు, పెళ్లి జరిపించే పురోహితుడు, హాజరైన వారిని సైతం శిక్షించే అవకాశం లేకపోలేదు. బాల్య వివాహం జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే 1098 నంబరుకు ఫోన్‌చేసి ఛైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వవచ్చు. వారు స్పందించి ఆ వివాహాన్ని జరగకుండా చేస్తారు.
పొస్టు పెట్టినా, దాన్ని పంపినా :సోషల్ మీడియా వినియోగం ఈ కాలంలో విపరీతంగా పెరిగింది. మనకు వచ్చిన సమాచారం పరిశీలించకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేసినా అది చట్ట ప్రకారం నేరమే. దీంతోపాటు వాటి గురించి తెలుసుకోకుండా వాట్సాప్‌లో స్టేటస్‌లు పేడితే జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు కలిగేలా, వ్యక్తిగత ఏవరినైనా నష్టపరిచినా, సున్నితమైన అంశాలపై అవగాహన కొరవడి స్పందించినా ఊచలు లెక్కపెట్టాల్సిందే. అలాంటి పోస్టులు పెట్టడం ఎంత ప్రమాదమో, వాటిని వైరల్ చేయడమూ అంతే నష్టాన్ని చేకూరుస్తుంది.