Commissioner Ranganath On HYDRA Project :కబ్జాదారులు చెరువులను చెరపడుతూ హైదరాబాద్ మహానగరాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తొలి ప్రాధాన్యతగా చెరువుల పరిరక్షణ కోసం నడుం బిగించిందన్నారు. ఈవీడీఎంలోని సిబ్బంది, 10 మంది అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 1979 నుంచి 2023 వరకు అందించిన నగర పరిధిలోని దాదాపు 56 చెరువుల శాటిలైట్ చిత్రాలను పరిశీలించామని, అందులో కొన్ని 60 శాతం, మరికొన్ని 80 శాతం మేర కుంచించుకుపోయినట్లు రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే హుస్సేన్ సాగర్ కూడా 21 శాతం కబ్జాకు గురైనట్లు రంగనాథ్ వివరించారు. అలాగే బతుకమ్మ కుంట, తుమ్మలకుంట వందకు వంద శాతం కనుమరుగైందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో పని చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి దశలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కట్టడి చేయడం, రెండో దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేయడం, మూడో దశలో గొలుసు కట్టు చెరువులకు ప్రాణం పోసేలా నాలాలను పరిరక్షించడం, చెరువుల్లో పూడిక తీయడం చేస్తామని రంగనాథ్ వివరించారు.
"గొలుసుకట్టు చెరువులన్నీంటిని పునరుద్ధరిస్తాం. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయి. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయం. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమదనం చేస్తాం. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తాం. పార్కు స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలు సహకరిస్తున్నాం. బస్తీ వాసుల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలి." - రంగనాథ్, హైడ్రా కమిషనర్