HYDRA Announcement On Demolitions : తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. 12 రోజుల తర్వాత మరోసారి హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పంజా విసిరింది. బుల్డోజర్లతో విరుచుకుపడి, పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన నివాసాలను, బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ప్రకటన :ఈ మేరకు ఆదివారం జరిగిన కూల్చివేతలకు సంబంధించి వివరణ ఇచ్చిన హైడ్రా, ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు స్పష్టం చేసింది. కూకట్పల్లి నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, సర్వే నెంబర్ 66, 67, 68, 69లో 16 కమర్షియల్ షెడ్లు, ప్రహరీ గోడలను అక్రమంగా నిర్మించినట్లు గుర్తించామని, వాటిని కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది.
డబుల్ సెంచరీ దాటిన హైడ్రా కూల్చివేతలు - తెలంగాణ ప్రభుత్వానికి లేటెస్ట్ రిపోర్ట్ - HYDRA Demolitions Latest Report
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించారని హైడ్రా పేర్కొంది. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామని, అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. అలాగే పటేల్‌గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
8 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం :ఈ మూడు ప్రాంతాల్లో మొత్తంగా 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించినట్లు హైడ్రా వివరించింది. రెవెన్యూ, నీటి పారుదల, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సంయుక్తంగా మూడు చోట్ల ఆపరేషన్ చేపట్టామని హైడ్రా వెల్లడించింది. నీటి వనరుల సంరక్షణ, ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూడటమే తమ లక్ష్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఏర్పడి రెండు నెలలు పూర్తవగా, ఇప్పటి వరకూ 26 చోట్ల 306 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో 119 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి హైడ్రా విడిపించింది.
ఆక్రమణల అంతుచూస్తాం - ఏపీలోనూ హైడ్రా తరహాలో వ్యవస్థ : మంత్రి నారాయణ - Minister Narayana Interview 2024