HYDRA Action Plan On Encroachments Demolitions :హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెట్టి రెండు రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసి గానీ సిబ్బంది వెనుదిరిగి రావడం లేదు. కొన్నేళ్లుగా చూస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు అక్రమ భవనాలు కూల్చివేతలు పాక్షికంగా చేపట్టేవారు. కొన్ని గోడలను కూల్చివేయడం, స్లాబులకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు.
ప్రస్తుతం హైడ్రా అందుకు భిన్నంగా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు. ఎంతటి నిర్మాణాలైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో రెండు రోజులపాటు శ్రమించి 3 భారీ భవనాలను నేలమట్టం చేశారు. సుమారు 10 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రిపురంలోని బూమ్‌రుఖా ఉద్ దవాళ చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు, ప్రహారి గోడలు, అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటివేళ్లతో పెకలించేశారు. చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించి పదెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమకట్టడాలపై ఉక్కుపాదం :మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని దేవేంద్రనగర్ చెరువు బఫర్ జోన్‌లోని 51 అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ తుమ్మిడి కుంట చెరువులో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను ఆరు గంటలు శ్రమించి పూర్తిగా నేలమట్టం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలోని ఆక్రమణలను తొలగించింది. ఇలా ఆక్రమణలకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఎక్కడ, ఎప్పుడు కూల్చివేతలు మొదలుపెడతారో ఏ ఒక్కరికీ తెలియకుండా జాగ్రత్తపడుతూ నిబంధనలు అతిక్రమించి కట్టిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
మూడో కంటికి తెలియకుండా :హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పొక్కకుండా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్త పడుతున్నారు. పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీరంతా మర్నాడు ఉదయం ఎక్కడికి వెళ్లాలో చెప్పడం లేదు. ఉదయమే వారికి చెప్పి కూల్చివేతల ప్రాంతాలకు తీసుకెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు.