Hyderabad Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలు వల్ల నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి రూ. 6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ప్రతి ఏడాదికి రూ.1300 కోట్లు నష్టపోతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అందువల్లే ఆ సంస్థ రెండో దశ నిర్మాణానికి ముందుకు రాలేదని, ఎల్ అండ్ టీకి వాటిల్లుతున్న నష్టంతో మరే ఇతర ప్రైవేటు సంస్థలు కూడా మొగ్గు చూపడం లేదని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని అడిట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన ఆడిట్ వీక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రస్థానాన్ని గుర్తు చేశారు.
రెండో దశ నిర్మాణానికి సంబంధించి 76 కిలో మీటర్ల మార్గానికి రూ.24,269 కోట్లలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆ నిర్మాణం జరుగుతుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామని వివరంచారు. హైదరాబాద్ ప్రజల సహకారంతో రెండో దశను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
"హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించాం. రెండో దశలో 76 కి.మీ మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నాం. మెట్రో రైలు రెండో దశ నిర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నది. మెట్రో రైలు రెండో దశకు ప్రైవేటు సంస్థలేవీ ముందుకు రాలేదు. మెట్రో రైలు మొదటి దశలో ఎల్ అండ్ టీ సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. ఎల్ అండ్ టీ అనుభవంతో ప్రైవేటు సంస్థలేమీ ముందుకు రావడం లేదు. మొదటిదశ మెట్రో వల్ల ఎల్ అండ్ టీ సంస్థకు రూ.6 వేల కోష్టం. మెట్రో వల్ల ఎల్ అండ్ టీ సంస్థ ఏడాదికి రూ.1300 కోట్లు నష్టపోతుంది. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రో రైలును నిర్వహిస్తున్నాయి. బ్యాంకులు కూడా మెట్రో రైలు నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు."- ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ