Hyderabad Man Missing Case Traced :వంద రోజులు అదృశ్యమయ్యాడు. ఆరేళ్ల కిందటి ఛాయాచిత్రం మాత్రమే ఉంది. అతని దగ్గర ఎటువంటి మొబైల్ అందుబాటులో లేదు. అసలు సరైన ఆధారం ఏమీ లేవు. ఫిర్యాదు తీసుకొని బంజారాహిల్స్ పోలీసులు అదృశ్యమైన వ్యక్తి ఆచూకీని సాంకేతికత ఆధారంగా పట్టుకున్నారు. అతని కదలికలపై నిఘా పెట్టి సోమవారం అదుపులోకి తీసుకొన్నారు.
బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం: షౌకత్‌నగర్‌కి చెందిన షేక్ ఫిరోజ్(42) ఆరు సంవత్సరాల కిందట రాధికను పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దీంతో తన మకాంని నందినగర్‌కి మార్చాడు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. పెళ్లైన నాటి నుంచి తరచూ గొడవలు జరుగుతుండటంతో పెద్దలు చాలా సార్లు సర్ధిచెప్పేవారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేవారు. భార్యతో గొడవలు పెరగడంతో ఫిరోజ్ సెప్టెంబరు 1న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భర్త వస్తాడని చూసినా తిరిగి రాకపోవడంతో సెప్టెంబరు 4న భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఫిరోజ్ ఫోన్ అందుబాటులో లేదు.
పాత ఫోన్ నెంబర్ ట్రాకింగ్‌తో : అతడి ఆరేళ్ల కిందటి ఛాయాచిత్రమే ఆమె వద్ద ఉంది. దీంతో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన బంజారాహిల్స్ ఎస్సై కోన రమేష్ నిందితుడి పాత ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి స్నేహితుల వివరాలను తీసుకున్నారు. ఫిరోజ్ కొత్త ఫోన్‌ను ఆదివారం ట్రాక్ చేసి అతను వైజాగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఆదివారం రాత్రి ఫిరోజ్ వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చి మెట్రో రైలులో వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. యూసుఫ్‌గూడలో దిగి రహ్మత్‌నగర్ వైపు వెళ్తుండగా పీజేఆర్ విగ్రహం సమీపంలో ఫిరోజ్ ధూమపానం కోసం మాస్క్ తీశాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.