Hyderabad Court Summons Pawan Kalyan :తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు హైదరాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. లడ్డూ వ్యవహారంలో పవన్ ఆరోపణలపై న్యాయవాది ఇమ్మనేని రామారావు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కల్యాణ్ ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు.
పవన్ కల్యాణ్‌కు కోర్టు సమన్లు :అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ జరిగిందని మాట్లాడారని, ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని రామారావు కోరారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని అందులో పేర్కొంది.
సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా: పవన్ కల్యాణ్
అసలేంటీ వివాదం :ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అంశం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని ఆరోపించారు. ఈ విషయం సర్వోన్నత న్యాయస్థానం వరకూ వెళ్లింది. ఈ వ్యవహారంపై సీబీఐతో పాటు ఏపీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగం అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గతంలో తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా టచ్ చేస్తే మాడి మసైపోతారన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గత నెల 22న ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం విధితమే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అరాచకాలు జరిగాయని కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. ఐదేళ్లుగా సనాతన ధర్మంపై దాడి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అనేక విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డారని పవన్ ధ్వజమెత్తారు. ఆ అంశాలన్నింటిని ఉన్నత న్యాయవ్యవస్థ, జాతి దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో డెయిరీ మాఫియా? - వాణిజ్య పన్నుల శాఖ రిపోర్టు - TIRUMALA LADDU GHEE CASE