ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హాస్పిటల్​లో మృతి చెందిన భర్త - 3 నెలల తరువాత వెతుక్కుంటూ వచ్చిన భార్య - HUSBAND MISSING CASE

విజయవాడ కొత్తాసుపత్రిలో శవ పంచాయితీ - మూడు నెలల తరువాత వచ్చిన భార్య

Husband Missing Case
Husband Missing Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 11:29 AM IST

Husband Missing Case: విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో 3 నెలల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహం విషయంలో వివాదం నెలకొంది. మృతదేహాన్ని 10 రోజులు మార్చురీలో ఉంచినా ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా గుర్తించి నిబంధనల ప్రకారం చెన్నైలోని ఓ వైద్య కళాశాలకు అప్పగించారు. మూడు నెలల తర్వాత అతని భార్య వెతుక్కుంటూ వచ్చి, తన భర్త ఎక్కడని అడగడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆసుపత్రి వర్గాలు, బంధువుల తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది అక్టోబర్‌ 27వ తేదీన విజయవాడలోని బెంజిసర్కిల్‌ సమీపంలో గోన శాంసన్‌రాజు(45) అనే వ్యక్తి పడిపోయి కనిపించాడు. అతనిని ఓ వ్యక్తి కొత్తాసుపత్రికి తీసుకొచ్చి చేర్చగా, శాంసన్​రాజు అదేరోజు చనిపోయాడు. తర్వాత అతని మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. పది రోజులైనా మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా గుర్తించారు. ఆ తరువాత పోలీసులు క్లియరెన్స్‌ ఇవ్వడంతో చెన్నైలోని ఓ మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని ఇచ్చారు.

3 నెలల తరువాత:హాస్పిటల్​లో శాంసన్‌రాజును చేర్చిన వ్యక్తి ద్వారా 3 నెలల తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. దీంతో గత నెల 20వ తేదీన అతని భార్య శైలజ, అల్లుడు ప్రేమ్‌రాజు తదితరులు వచ్చి అడిగారు. శాంసన్‌రాజు చనిపోయాడని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. తర్వాత కొన్నిరోజులకు డెత్ సర్టిఫికేట్​ని ఇచ్చారు.

ఇదీ జరిగింది:ఇజ్రాయల్‌పేటవాసి అయిన శాంసన్‌రాజు పెయింటర్‌గా పనిచేసేవాడు. శాంసన్​రాజుకి భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పనిమీద వెళ్లి ఒక్కోసారి నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చేవాడు. ఈసారి నెల దాటినా రాకపోవడంతో పాటు, సమాచారం లేకపోవడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఈక్రమంలో ఆసుపత్రిలో చేర్చారనే విషయం మూడు నెలల తర్వాత తెలిసింది. దీంతో గత నెలలో ఆసుపత్రికి వచ్చి అడగడం, వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడంతో వివాదం ముగిసింది.

చనిపోయింది శాంసన్‌రాజేనా!:శాంసన్‌రాజు బంధువులు వచ్చి అసలు మీకు ఒక్క ఫొటో అయినా చూపించారా అని అనుమానం రేకెత్తించడంతో భార్య శైలజ, బంధువులు మళ్లీ ఆసుపత్రికి వచ్చి అధికారులను ప్రశ్నించారు. పోలీసులు అనుమతి ఇచ్చాకే, మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అప్పగించామని, ఫొటోలు పోలీసుల దగ్గరే ఉంటాయని తెలిపారు. మూడు నెలలు దాటడంతో ఫొటోలు తమ దగ్గర లేవని పోలీసులు చెప్పడంతో శాంసన్‌రాజు బంధువులు తల్లడిల్లారు.

మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం మృతదేహాన్ని ఇవ్వడం మంచిదే కానీ మృతదేహం తమ బంధువుదో కాదో అనే అనుమానం ఉందని శాంసన్‌రాజు అల్లుడు ప్రేమ్‌రాజు వాపోయాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచినా ఎవరూ రాకపోవడంతో నిబంధనల ప్రకారమే మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని ఇచ్చామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.వి.రావు తెలిపారు.

భర్త మృతదేహం కోసం భార్యల గొడవ - చివరికి ఏమైందంటే?

ABOUT THE AUTHOR

...view details