తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నూపీకి జ్వరం, పప్పీకి పంటి నొప్పి - పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా పెరుగుతోన్న డిమాండ్‌ - Huge Demand For Pets Doctors - HUGE DEMAND FOR PETS DOCTORS

Pets Doctors Demand in Telangana : ఓ ముద్ద పెడితే ఇంటి ముందు పడుంటుంది. గస్తీ కాస్తుందనే భావనే ఇన్నాళ్లూ శునకాలపై. ‘అమ్మో వద్దు, ఎదురొస్తే అపశకునమనే భయం మొన్నటిదాకా మార్జాలమంటే. ‘అరుపులా, అబ్బా తలనొప్పి మనకే స్థలం లేదు. ఇంకా ఇవెక్కడ. ఇదే ప్రతికూల ఆలోచన పక్షులంటే కొన్నాళ్ల దాకా. కానీ, ఇప్పుడివన్నీ మారాయి. కుక్క, పిల్లి, పక్షీ.. కన్నోళ్లతో సమానం. మరీ చెప్పాలంటే మమకారం కూడా ఎక్కువే. కొవిడ్‌ మహమ్మారి తర్వాత మూగజీవాల పెంపకంపై అంతా మనసు పడుతున్నారు. కొనేందుకు, పెంచేందుకు నెలకు రూ.లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దీంతో వాటి పరిరక్షణకు పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది.

Veterinary Doctor Needs in Cities
Pets Doctors Demand in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 10:07 AM IST

Huge Demand For Pets Doctors in State :మా ఇంట్లో వాడిదే రాజ్యం. మా అమ్మకు వాడంటే ప్రాణం. వాడా.. మా చెల్లికి తమ్ముడురా. ఈ మధ్య నాన్న కూడా వాడ్ని బాగా గారం చేస్తుండు. నాకు వాడు లేకుంటే ఏమీ తోచదు. అసలీ ముచ్చట్లు వేటి గురించి అనుకుంటున్నారా? మీరు ఊహించింది నిజమే. అవును, ఇళ్లలోని పెంపుడు జంతువుల (పెట్స్​) గురించే. రాష్ట్రంలో ఇటీవల కుక్కలు, పిల్లులను పెంచుకోవడం విపరీతంగా పెరిగింది. సోషల్​ మీడియాలోని వీడియోలే ఇందుకు సాక్ష్యం.

వాటి ఆహారానికి, ఆరోగ్యానికి ఎంత ఖర్చు చేయాలన్నా తగ్గేదేలే అంటున్నారు. అందుకే నగరాలు, పట్టణాల్లో ఇటీవల పెట్‌ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్​ సెంటర్​లు ఒక వెలుగు వెలుగుతున్నాయి. ప్రస్తుతం కమర్షియల్​ లైసెన్స్‌లు తీసుకొన్న పెట్‌ క్లినిక్‌లు రాష్ట్రవ్యాప్తంగా 1,012 నడుస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 390 ఉన్నాయి. దాంతో డాక్టర్స్​, సిబ్బందికి డిమాండ్‌ పెరుగుతోంది.

రాష్ట్రంలో 16 లక్షల వరకు వీధికుక్కలు, 1.20 లక్షల వరకు పిల్లులు : రాష్ట్రంలో పెంపుడు జంతువుల రిజిస్ట్రేషన్​ చాలా తక్కువ. ఇంటింటి గణన లేకపోవడంతో మూగాజీవాల సంఖ్యపై కచ్చితమైన లెక్కలు లేవు. కానీ, పశు సంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 16 లక్షల వరకు వీధికుక్కలు, 1.20 లక్షల వరకు క్యాట్స్​ ఉన్నాయి. వీటిలో 3.20 లక్షల పెట్​ డాగ్స్​, 32 వేల పిల్లులున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 2.40 లక్షల మేరకు పెంపుడు కుక్కలున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో పదిన్నర వేల పెంపుడు కుక్కలు నమోదై ఉండగా, రిజిస్టర్​కానివి మరో 42 వేలున్నాయి.

ఒక్కో జంతువుకు ఓపీ కనిష్ఠంగా రూ.500 : పెట్‌ క్లినిక్‌లకు వచ్చే వాటిలో 90% కుక్కలే ఉండటం గమనార్హం. మిగిలిన 10 శాతం సంఖ్యలో పిల్లులు, కుందేళ్లు, చిలుకలు ఉంటాయి. వీటికి ఫీవర్​, కడుపునొప్పి, అజీర్ణం, చర్మ, దంత, నేత్ర, శ్వాసకోశ తదితర అనారోగ్య సమస్యలు తరచూ వస్తాయి. యాంటీ రేబిస్‌ టీకాలు, నట్టల మందునూ జంతువలకు వేయించాల్సి ఉంటుంది. అలానే కు.ని. శస్త్రచికిత్సలు చేయిస్తారు.

గాయాలైతే చికిత్స చేయడం తప్పదు. ఒక్కో జంతువుకు ఓపీ కింద రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జ్​ చేస్తారు. ఇంటికొచ్చి వైద్యం అందిస్తే రూ.1000 అదనం. ఎమెర్జెన్సీ అంబులెన్సులను వాడితే రూ.2000 చెల్లించాల్సిందే. సర్జరీలు కోసం రూ.3000 నుంచి రూ.5000 తీసుకుంటున్నారు. ఒక్కో క్లినిక్‌కు కనీసం 20 వరకు ఓపీలు నిత్యం ఉంటున్నాయి. అదేవిధంగా నెలకు వందకుపైగా శస్త్రచికిత్సలు ఉంటున్నాయి.

రూ.60 వేలకుపైనే ప్రారంభ వేతనం :వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ, పీజీ చేసిన వారు మాత్రమే పశువైద్యం చేయడానికి అర్హులు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,440 మంది పశువైద్యులుగా రిజిస్టర్​ అయ్యారు. వీరిలో సగానికిపైగా గవర్నమెంట్​ సెక్టార్​లో, మిగిలిన వారు ప్రైవేటు క్లినిక్‌లలో పనిచేస్తున్నారు. పెరుగుతున్న పెట్స్​కు అనుగుణంగా డిమాండ్‌ భారీగా ఉండటంతో పశువైద్యుడికి ప్రారంభ వేతనం నెలకు రూ.60 వేలకుపైగా లభిస్తోంది. శస్త్రచికిత్సలు చేస్తే రూ.2 లక్షల వరకు అర్జిస్తున్నారు. సిబ్బందికి రూ.30 వేలు ఆదాయం వస్తుంది. పెంపుడు జంతువుల మెడిసస్​ సైతం ఖరీదైనవే. కేవలం వాటికందించే ఆహారానికి నెలకు రూ.5.000 వరకు అవుతుంది.

"పెంపుడు జంతువులకు అందించే ట్రీట్​మెంట్​ సున్నితంతోపాటు సంక్లిష్టమైంది. అందుకే ఛార్జ్​ ఎక్కువ. ఒక్కోసారి పొరపాటున అవి వైద్య సిబ్బందిని కరిస్తే గాయాలు, ఇతర సమస్యలు తప్పవు. పశువైద్యుల కొరత కారణంగా వారికి మంచి వేతనాలే అందుతున్నాయి. కొత్త బ్యాచ్‌ల వారికి వెంటనే ఉద్యోగాలు లభ్యమవుతున్నాయి."-రాజు, పెట్‌ క్లినిక్‌ నిర్వాహకులు, హైదరాబాద్‌

రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి : రాష్ట్రంలోని పశువైద్య మండలిలో వైద్యుల నమోదు గతంలో కంటే పెరుగుతోందని పశువైద్య మండలి రిజిస్ట్రార్‌ సుబ్బారాయుడు తెలిపారు. గవర్నమెంట్​ సెక్టార్​లోనే కాకుండా పెట్‌ క్లినిక్‌లు, ఉద్యోగావసరాల రిజిస్ట్రేషన్ల కోసం వైద్యులు వస్తున్నారన్నారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.

మీ ఇంట్లో పెట్స్‌ ఉన్నాయా ? ఈ టిప్స్​ పాటిస్తే సూపర్​ హెల్దీగా ఉంటాయి!

కలలో జంతువులు కనిపిస్తే అదృష్టమా! దురదృష్టమా! 'స్వప్న శాస్త్రం' ఏం చెబుతోంది? - Animal Symbolism In Dreams Mean

ABOUT THE AUTHOR

...view details