How to Study for 10th Class and Inter Exams: పది, ఇంటర్ పరీక్షలు దగ్గరపడటంతో ఉత్తమ మార్కులు సాధించేందుకు విద్యార్థులు రేయింబవళ్లు చదువుతుంటారు. చాలామంది ర్యాంకులు సాధించాలన్న తపనలో ఒత్తిడితో కూడా చదువు కొనసాగిస్తున్నారు. చదువులో రాణించలేమన్న భయంతో మరికొందరు డిప్రెషన్స్‌కు లోనవుతుంటే ఇంకొందరు ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి భయం పోగొట్టేందుకు కొన్ని విద్యాసంస్థలు మోటివేషనల్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో చదివితే సులువుగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించవచ్చని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
అహర్నిశలు చదువుతున్న విద్యార్థులు:పదవ తరగతి పరీక్షలంటే విద్యార్ధులు వణికిపోతుంటారు. ఉత్తమ మార్కులు సాధించాలని అహర్నిశలు చదవటంతో కొందరు ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రధానంగా ఎక్కువ మంది విద్యార్థులు ప్రధాన పరీక్షలంటే కంగారు పడుతుంటారు. దీంతో చదివింది కూడా మరిచి పోతుంటారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు జరగనున్నాయి.
ఇప్పటికే పరీక్షలకు ప్రిపరేషన్ మెుదలు పెట్టిన విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకునేందుకు పోటీ పెట్టుకుని మరీ చదువుతున్నారు. అయితే మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ పాఠశాలల్లో టీచర్లు, ఇళ్లలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుంటారు. ఈ ప్రభావం పిల్లల మానసిక పరిస్థితిపై పడి తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.