How to Know friends envy character : రక్త సంబంధీకులు లేని మనిషి ఉంటాడు గానీ.. మిత్రుడు లేని మనిషే ఉండడు! జీవితంలో స్నేహం ఎంత అనివార్యమైనదో తెలుసుకోవడానికి ఈ రెండు వాక్యాలు చాలు. అయితే.. మిత్రుల పేరుతో మన చుట్టూ ఉన్నవారంతా స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్లు కాకపోవచ్చు. మన వెంటే ఉంటూ వెనక గోతులు తవ్వే బ్యాచ్ కావొచ్చు! నోటి నవ్వుతూ నొసటితో వెక్కిరించి రకం కావచ్చు! మరి.. ఆ విషయం ఎలా కనిపెట్టాలో మీకు తెలుసా?
అసూయ..
నిజమైన స్నేహితులు మనం ఓడిపోతే భుజం తడతారు. మనం గెలిస్తే వాళ్లు సంబరాలు చేసుకుంటారు. కానీ.. విషపూరిత స్నేహితులు మీ విజయాలను కూడా విమర్శిస్తారు. ఏదో ఒక వంకచూపుతూ నిత్యం మిమ్మల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా మీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టాలని చూస్తుంటారు. ప్రతి దాంట్లోనూ మీపైన గెలవాలని చూస్తుంటారు. హాస్యం పేరుతో మిమ్మల్ని ఎగతాళి చేస్తుంటారు. అవకాశాలు సృష్టించుకొని మరీ హేళన చేస్తుంటారు. కానీ.. ఒక్కసారి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించరు. నిజమైన స్నేహితులు ఇలా ఎన్నటికీ చేయరు.
మైండ్ గేమ్..
స్నేహితులుగా మీ చుట్టూ ఉంటూనే మీతో మైండ్ గేమ్ ఆడుతుంటారు. మీ సక్సెస్‌ను అడ్డుకోవడానికి, మీరు ముందుకు సాగకుండా ఉండడానికి ప్లాన్స్ వేస్తుంటారు. మీరు ఏదైనా సలహాలు సూచనలు అడిగితే.. హార్ట్ ఫుల్‌గా స్పందించరు. ఎప్పుడైనా.. ఎవ్వరైనా స్నేహితుడితో గడిపిన తర్వాత మనసుకు హాయిగా ఉంటుంది. రిలాక్స్‌గా ఫీలవుతాం. అలా కాకుండా.. మీరు మానసికంగా నిరుత్సాహానికి గురయ్యారంటే మీ స్నేహంలో తేడా ఉన్నట్టు భావించొచ్చని నిపుణులు చెబుతున్నారు.