How to Use Electronic Voting Machine :ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు వచ్చే అతిపెద్ద పండుగ ఓటు. అటువంటి ప్రజాస్వామ్య పండుగలో మన ఓటు హక్కును విధిగా వినియోగించుకోవటం ఒక పౌరుడిగా మన కర్తవ్యం కూడా.దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా, ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. అదేస్థాయిలో ఐదేళ్ల పాటు తన ప్రతినిధిగా కొనసాగే నేతను ఎన్నుకునేందుకు వేసే ఓటుపై ఓటరుకు ఎలాంటి అనుమానం ఉండొద్దు.
పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో నిల్చొని, కేంద్రంలోనికి వెళ్లాక ఈవీఎం (ఎలక్ట్రానికి ఓటింగ్ మెషిన్)పై ఉన్న ఏదో ఒక మీట నొక్కి వచ్చేస్తే సరిపోదు. తాను వేసిన ఓటు, తాను వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా లేదా అన్న సందేహానికి తావులేకుండా నిర్ధారించుకోవడం అవసరం. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో జవాబుదారీ విధానాన్ని ఎన్నికల సంఘం అవలంభిస్తోంది.
Vote Importance in Democracy :తాను వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటరు నిర్ధారించుకునేందుకు వీలుగా ఓటింగ్ స్లిప్ (వీవీ ప్యాట్)ని ప్రదర్శిస్తోంది. అయితే ఇటీవల కర్ణాటకలో జరిగిన పోలింగ్ సందర్భంగా ఓటింగ్ ప్రక్రియపై ఓ ఓటరు అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
ఓటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకమని, దీనిపై ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఓటర్లకు చైతన్యం కల్పించేందుకు డెమో (నమూనా) ప్రదర్శించాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను ‘ఈనాడు - ఈటీవీ భారత్’ కోరింది. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కేంద్రంలో అధికారులు నమూనా (మాక్) పోలింగ్ విధానాన్ని ప్రదర్శించారు. ఈవీఎంలు ఎలా పని చేస్తాయి, ఓటర్లు తాము వేసిన ఓటును ఎలా పరిశీలించుకోవచ్చో పూర్తిగా వివరించారు.
ఓటరు చీటీ, ఐడీ కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక, మొదట పోలింగ్ అధికారి -1 వద్దకు వెళ్లాలి. ఓటరు వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల లిస్ట్‌లో పరిశీలిస్తారు. ఓటరు పేరు, జాబితాలో వరుస సంఖ్యను బిగ్గరగా చదువుతారు. ఆ కేంద్రంలో పార్టీల వారీగా ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆ ఓటరు పేరు, నంబరును తమ వద్ద ఉన్న ఓటరు లిస్ట్‌లో సరిచూసుకుంటారు.
అనంతరం పోలింగ్ అధికారి-2 వద్దకు ఓటరు వెళ్లాలి. అతని వద్ద ఉన్న స్లిప్‌లోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్లో సరిచూసుకుని, సంతకం తీసుకుంటారు. ఒకవేళ ఓటరు నిరక్షరాస్యులైతే వేలిముద్ర తీసుకుంటారు. ఎడమచేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటికీ ఎన్నికలు జరిగేచోట ఓటర్లకు ఎన్నికల అధికారులు రెండు వేర్వేరు రంగుల స్లిప్పులు ఇస్తారు. వాటి ఆధారంగా రెండు బ్యాలెట్ యూనిట్లలో వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు.