House Committee Meeting on Visakha Dairy Issues: ఈ నెల 9వ తేదీన విశాఖ డెయిరీని సందర్శించాలని ఈ రోజు అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన సభాసంఘం (హౌస్ కమిటీ) నిర్ణయించింది. విశాఖ డెయిరీ అవకతవకలపై అదే రోజు సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని సభాసంఘం నిర్ణయం తీసుకుంది. జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాస్, గౌతు శిరీష, బేబీ నయన, దాట్ల సుబ్బరాజు, బొండా ఉమా సమావేశంలో పాల్గొన్నారు.
విశాఖ డెయిరీ రైతుల సంక్షేమం వదిలి సొంత లాభం చూసుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయని నేతలు తెలిపారు. విశాఖ డెయిరీపై వచ్చిన అభియోగాలపై సుదీర్ఘంగా చర్చించామని సభాసంఘం నేతలు తెలిపారు. విచారణ ఎలా ప్రారంభించాలని ప్రాథమికంగా చర్చించామన్నారు. విశాఖ డెయిరీ ఎండీ, ఆర్ధిక లావాదేవీలు చూసేవారు 9వ తేదీన జరిగే సమావేశానికి రావాలని స్పష్టం చేశారు. స్పీకర్ అనుమతితో ఆడిటర్‌తో పాటు కోఆపరేటివ్, కంపెనీస్ యాక్ట్ మీద అవగాహన ఉన్నవారిని కూడా బృందంలో చేర్చుకుంటామన్నారు.
పాడిరైతులకు ఉపయోగం లేకుండా, యాజమాన్యానికి లబ్ది చేకూరేలా విశాఖ డెయిరీ ఉందనే ఆరోపణలు ఉన్నాయని, పాడి రైతులు నష్టపోకూడదనే కోణంలోనే సిఫార్సులు ఉంటాయని సభాసంఘం స్పష్టం చేసింది. లాభాల్లో నడిచిన విశాఖ డెయిరీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లి, ఆ నష్టం భారాన్ని పాడి రైతుల మీద వేయటం సబబు కాదని నేతలు అన్నారు. ప్రభుత్వ అజమాయిషీ లేకపోవటంతో, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసమే అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖ డెయిరీ ఆపరేషన్స్‌కు ఇబ్బంది లేకుండా నష్ట నివారణ చర్యలు సిఫార్సు చేస్తామన్నారు. ట్రస్టు నిధులు మళ్లింపు పైనా సమగ్ర నివేదిక సభ ముందు ఉంచుతామన్నారు.