TDP Winning Chances in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీకు ఎదురుగాలి విస్తోంది. ప్రత్యర్థిని ఓడించేందుకు కూటమి నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో మెుత్తం స్థానాలను కైవసం చేసుకోవడానికి సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెలుతున్నారు. అలాగే వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, అసంతృప్తులు, వ్యతిరేకతలాంటి అన్నింతో హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ అన్ని స్థానాల్లో ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బాలకృష్ణ - వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల వ్యవహారం : హిందూపురం పార్లమెంటు పరిధిలో హిందూపురం, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 16,39, 941మంది ఓటర్లు ఉన్నారు. హిందూపురం నుంచి తెలుగుదేశం తరఫున బీకే పార్థసారథి వైసీపీ నుంచి జె. శాంత బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల వ్యవహారం వైసీపీను ఇరుకున పెట్టడంతో ఆయన్ను పక్కన పెట్టేశారు. మాధవ్ స్థానంలో కర్ణాటకకు చెందిన శాంతను ఈసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. స్థానికేతరాలు కావడంతో ఈమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే కురబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథిని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్థసారథి గతంలో తెలుగుదేశం నుంచి రెండు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంపై బాగా పట్టు ఉండటం, ప్రజల్లో మంచి పేరు ఉండటంతో పార్థసారథికి గెలుపు నల్లేరుమీద నడకేనని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సాయి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి : 2021లో జిల్లా పునర్విభజన జరిగాక పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడింది. యువతకు ప్రాధాన్యమివ్వాలనే లక్ష్యంతో అభ్యర్థులను ఎంపిక చేసిన తెలుగుదేశం పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డికి అవకాశం కల్పించింది. విద్యావంతురాలైన సింధూర ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డినే వైసీపీ మరోసారి బరిలోకి దించింది. అయితే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్తి నేతలు పని చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే భావన ప్రజల్లోనూ బలంగా ఉంది. పుట్టపర్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భవనాల్లో కార్యాలయాలు నిర్వహించడంపై సాయి భక్తుల్లోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే దుద్దుకుంటను ఇంటికి పంపేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు.
ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం కంచు కోట :నందమూరితారకరామారావు కుటుంబానికి హిందూపురం కంచు కోట. హిందూపురంలో మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి ప్రత్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ తాజాగా తెలుగుదేశంలో చేరారు. ఇక్బాల్ ఓటమితో హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో వైసీపీలోనే మూడు అసమ్మతి గ్రూపులు తయారై రాళ్లదాడులు చేసుకునే వరకు వచ్చింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి దీపిక పోటీలో నిలిచారు. బెంగుళూరులో ఉంటున్న దీపికకు నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేదు. అసమ్మతి నేతలు ఆమెకు పూర్తిగా సహకరించట్లేదు. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్న తరుణంలో బాలకృష్ణ హాట్రిక్ సాధిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.