TDP Janasena Joint Action Committee Meeting:తెలుగుదేశంని ఎన్డీఏలో ఆహ్వానించారని, త్వరలో క్లారిటీ వస్తుందని దాపరికం ఏం లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన టీడీపీ - జనసేన కేడర్ ను అభినందిస్తూ తీర్మానం చేసారు. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసింది.
28న టీడీపీ - జనసేన ఉమ్మడి సభ: ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో తెలుగుదేశం - జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తాడేపల్లి గూడెం సభకు చంద్రబాబు - పవన్ హాజరు కానున్నారని వెల్లడించారు. ఉమ్మడి సభకు 6 లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేయనున్నారు. తాడేపల్లి గూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది, త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు - జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారన్నారు. క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం - జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం - జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతారన్నారని నేతలు ఆరోపించారు.
ఎన్నికల విధుల్లో వాలంటీర్లు:జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని, అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రాకూడదనే ఏకైక లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నామని నేతలు అభిప్రాయపడ్డారు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసీ చెబుతోంటే, ధర్మాన దానికి విరుద్దంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని అధినేతలిద్దరూ చెప్పారు. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని, చంద్రబాబు, పవన్ చెబుతూనే ఉన్నారన్నారు.