High Tension in MLA Chevireddy Bhaskar Reddy Native Village : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు జేసీబీలతో భారీ సంఖ్యలో రెవెన్యూ అధికారులు, పోలీసులు మోహరించారు. అనంతరం ఆక్రమణలు తొలగించే పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నేత పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి గ్రామస్థులకు మద్దతుగా వెళ్లారు. ఆందోళనకు దిగిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇంట్లోనే నిర్బంధించారు. పులివర్తి నానిని కూడా గృహ నిర్బంధం చేశారు.
Houses Demolition in Chandragiri :ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న మహిళకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలి పనులు చేసుకుంటూ స్థలాలు కొనుగోలు చేశామని, అధికారులు వచ్చి వాటిని తొలగించడం తగదని అన్నారు. ఎమ్మెల్యే బంధువులు భవన నిర్మాణాలు చేపడుతుంటే ఎవరూ అడ్డు చెప్పడం లేదని, పేదల షెడ్లను మాత్రం తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 ఎకరాలను చెవిరెడ్డి తన అధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. మఠం అధికారులు వాటిని వెంటనే స్వాధీన పరచుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతల పర్వం.. భారీగా మోహరించిన పోలీసులు
పరిహారం చెల్లించాలని డిమాండ్ : తుమ్మలగుంటలో ఆక్రమణలు తొలగింపు పేరుతో పోలీసులు జేసీబీలతో పేదల ఇళ్లు కూల్చేశారని సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు మఠం భూముల్లో కేవలం పేదల ఇళ్లు మాత్రమే ఎందుకు కూల్చివేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆక్రమణలోని మఠం భూముల స్వాధీనానికి చెవిరెడ్డి యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. బాధితులకు వెంటనే పరిహారం చెల్లించాలని జనసేన నాయకుడు మనోహర్ డిమాండ్ చేశారు.