High Court Strongly Condemned Removal of Hundreds of Villages from Scheduled Areas : ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల నుంచి వందల గ్రామాలను తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. షెడ్యూల్డ్ ఏరియాలను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 292 కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
గిరిజన హక్కుల్ని రక్షించాలంటూ :విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల షెడ్యూల్డ్ ఏరియా హద్దులను గిరిజనేతరులకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకటశివరాం 2023లో హైకోర్టు (High Court)లో పిల్ వేశారు. షెడ్యూల్డ్ ఏరియా హద్దులను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్యాంసుందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజనేతరులకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.