High Court Bench in Kurnool : కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీనివాస శివరాం ఈ నెల 29న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు లేఖ రాశారు. 15 మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, న్యాయవాదులకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస, వసతి సౌకర్యాల పూర్తి సమాచారాన్ని ఈ నెల 30లోపే (ఒక్కరోజులోనే) తమ ముందు ఉంచాలని, ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్‌కు రాసిన లేఖలో రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
ఒక్కరోజులోనే నివేదిక : ఈ వివరాలను హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఈ లేఖపై వెంటనే స్పందించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా రహదారులు, భవనాలశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఆర్డీవోలకు లేఖ రాశారు. హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ/ప్రైవేటు భవనాలు ఉన్నాయా ?లేవా? అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి ఈ నెల 30లోపు నివేదిక ఇవ్వాలని కర్నూలు ఆర్డీవోకు స్పష్టం చేశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కూటమి హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక బెంచ్ ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాలను తెలిపేందుకు కాంపిటెంట్ అథారిటీ (హైకోర్టు న్యాయమూర్తులు-ఫుల్ కోర్ట్) ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ అప్పటి కార్యదర్శి గతేడాది అక్టోబరు 28న హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
న్యాయమూర్తులతో కమిటీ : కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ఏర్పాటు చేశారు. జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ ఎన్.జయసూర్య, జస్టిస్ బి.కృష్ణమోహన్‌లకు కమిటీలో స్థానం కల్పించారు.