తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో రద్దు - కానీ వారికి మినహాయింపు - CONTRACT EMPLOYEES GO CANCELLATION

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో రద్దు -సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టేసిన హైకోర్టు - కానీ ఇప్పటివరకు ఉద్యోగులను తొలగించొద్దని హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశం

Telangana High Court
Telangana High Court (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 4:22 PM IST

Updated : Nov 19, 2024, 6:45 PM IST

Telangana High Court : కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి తీసుకొచ్చిన సెక్షన్‌ 10A ను హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చట్టానికి సవరణ తెస్తూ గత ప్రభుత్వం సెక్షన్ 10A తీసుకొచ్చింది. దీని ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులను, క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ సెక్షన్‌ ద్వారా ఇప్పటికే క్రమబద్ధీకరించిన ఉద్యోగులను మాత్రం తొలగించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేపట్టాలని.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం ద్వారా కాదని హైకోర్టు పేర్కొంది.

గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్షన్‌ 10ఏ సవరణ ద్వారా పలు విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్దమన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఇదే విషయాలను వెల్లడిస్తున్నాయని వాదించారు. ఎంతో మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేసి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని.. కానీ గత 20ఏళ్లుగా లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడలేదని తెలిపారు.

ప్రతిభ ఉన్నవాళ్లకు ఉద్యోగం దక్కలేదు : కానీ ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26న జీఓ 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10ఏ ద్వారా పలు విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిందని వాదించారు. కాంట్రాక్టు ఉద్యోగులను సైతం నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారని.. ప్రతిభ ఉన్న వాళ్లకు కాకుండా పైరవీల ద్వారా వచ్చిన వాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరారన్నారు. అలాంటి వారిని ఇప్పుడు జీఓల ద్వారా క్రమబద్ధీకరించడం వల్ల ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశం దక్కడం లేదన్నారు.

క్రమబద్ధీకరణను కొట్టివేసి.. నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని సుప్రీంకోర్టు 2006లోనే తీర్పు వెలువరించిందని.. అయినా ప్రభుత్వం సెక్షన్ 10ఏను తీసుకురావడం ఆర్టికల్ 14,16, 21 ప్రకారం విరుద్ధమని పిటీషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.

2009 నుంచి విధుల్లో ఉన్నారు.. ఇప్పుడు తొలగిస్తే : రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం పాలనలో సౌలభ్యాల కోసం సవరణ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ వాదించారు. గతేడాది ఏప్రిల్ 30న 5,544మంది కాంట్రాక్టు ఉద్యోగులను వయసు, తదితర నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించినట్లు కోర్టుకు తెలిపారు. 2009 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ల పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరించారని తెలిపారు.

ఈ దశలో వాళ్లను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు క్రమబద్ధీకరణ అయిన ఉద్యోగులు 2009 నుంచి విధులు నిర్వహిస్తున్నారంది. దాదాపు 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లను ఇప్పుడు విధుల నుంచి తొలగించడం సరికాదంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ తీర్పును ఇస్తున్నట్లు పేర్కొంది.

ఇక మీదట నియామకాలు చేపట్టవద్దు : కాంట్రాక్టు ఉద్యోగులను ఇష్టారీతిన తీసుకొని.. ఆ తర్వాత వాళ్లను క్రమబద్ధీకరించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కోర్టు తెలిపింది. కానీ ఇప్పటికే క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వాళ్లను తొలగించొద్దని పేర్కొంది. ఇక మీదట చేపట్టే నియామకాల విషయంలో నోటిఫికేషన్లు వెలువరించి ఉద్యోగాలు భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులు : రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో ఉన్న 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2,909 మంది జూనియర్‌ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్‌), 390 మంది పాలిటెక్నిక్‌, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు ఉన్నారు.

సీఎం కార్యక్రమంలో స్టాఫ్​ నర్సుల ఆందోళన - రెగ్యులర్​ చేయాలని డిమాండ్

ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ

Last Updated : Nov 19, 2024, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details