High Court Hearing on TDP MLA Eluri Case:విధులకు ఆటంకం, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో నెల్లూరు జిల్లా నిఘా విభాగం గనులు, భూగర్భశాఖ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తదితరులపై బాపట్ల జిల్లా మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిలు కోసం ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణలో 41ఏ నోటీసు ఇవ్వాల్సిన కేసులలోనూ పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామన్యుల పరిస్థితి ఏమిటని? హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తాజాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కోర్టుకు వివరించారు.
ఇవాళ తప్పు చేసి రేపు తప్పించుకోగలరా? - ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసులలో అరెస్టు చేయడానికి వీల్లేదన్నారు. 41ఏ నోటీసు ఇవ్వాలన్నారు. ఆధారాలు లేకుండా దర్యాప్తు అధికారి అనుమానాలతో వ్యక్తులను అరెస్టు చేయడం కుదరదన్నారు. చట్టనిబంధనలకు వక్రభాష్యం చెబుతూ ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో పోలీసుల వద్ద సరైన కారణాలు, ఆధారాలు లేవన్నారు. నిందితులను మెజిస్ట్రేట్ యాంత్రిక ధోరణిలో రిమాండ్‌కు పంపారన్నారు. వారందరు ప్రస్తుతం బెయిలు పొందారన్నారు.
పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు ఫారం7 దాఖలు చేసి భారీగా ఓట్లను తొలగించిన వ్యవహారంపై ఎమ్మెల్యే హైకోర్టులో వ్యాజ్యం వేశారన్నారు. ఎన్నికల సంఘం విచారణ జరపిందన్నారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు సస్పెండ్ అయ్యారన్నారు. ఈ కారణంగా పిటిషనర్‌పై కక్షపూరితంగా తప్పుడు కేసు పెట్టారని పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్ని ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవన్నారు. నేర ఘటన తీవ్రత తక్కువైనందున ముందస్తు బెయిలు మంజూరు చేయాలని లేదా 41ఏ నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.