Hidden Cameras In Girls Hostel In AP :ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ అంశంపై అర్ధరాత్రి విద్యార్ధినులు కళాశాల ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లోని బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు ఉంచారంటూ వసతిగృహ ప్రాంగణంలో విద్యార్థునులు నిరసన తెలిపారు. సెల్‌ఫోన్ టార్చ్లైట్లు వేస్తూ తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఈ కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లోకి పంపుతూ, వాటిని విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సహచర విద్యార్ధులు దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్కు చేరుకున్నారు. వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రహస్య కెమెరా ఘటనపై పోలీసులు ఆరా :జూనియర్, సీనియర్ విద్యార్థులతో చర్చించారు. తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్ధులు, ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో అతడిని మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం గురించి, బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా చేసిన పోస్టులను సైతం విద్యార్ధినులు పోలీసులకు చూపించారు. ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూసిందని తెలిపారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.