Heavy Security with 5000 Police on Indrakeeladri During Sharan Navaratri Celebrations : ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్థం వస్తుంటారు. ఈ సందర్భంగా క్యూలైన్ల నిర్వహణ, బందోబస్తు, చోరీలు జరగకుండా నగర పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా కసరత్తు చేస్తున్నారు. వీఐపీల రాకతో సామాన్య భక్తులు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు దాదాపు ఐదు వేల మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నారు.
రద్దీకి తగ్గట్లుగా సిబ్బంది :అమ్మవారి దర్శనార్థం సాధారణ రోజుల్లో రోజుకు లక్ష మంది చొప్పున, మూలా నక్షత్రం రోజు 2.5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. దసరా రోజు నిర్వహించే తెప్పోత్సవం సందర్భంగా రెండు లక్షల మంది వరకు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో కొండపైన, దిగువన ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణకు నగర కమిషనరేట్‌లోని సిబ్బందికి తోడుగా వివిధ జిల్లాల నుంచీ పోలీసులను పిలిపిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోజుకు మూడు షిఫ్టుల్లో విధులు కేటాయించనున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆలయం, దుర్గాఘాట్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వినియోగించనున్నారు. భక్తుల రద్దీ తట్టుకునేలా పలు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో తొక్కిసలాటకు తావులేకుండా ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో దాదాపు 15వేల మంది వరకు వేచి ఉండే అవకాశం ఉంది.
ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు - Pavitrotsavalu on Indrakiladri
అణువణువునా నిఘా :ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి దృశ్యాలను చూసేందుకు 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్‌లో సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. లక్షల్లో భక్తులు వస్తున్నందున నేరస్థుల కదలికలపైనా నిఘా ఉంచబోతున్నారు. చోరీలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. డ్రోన్లతో అవసరమైన చోట్ల చిత్రీకరిస్తారు. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లాల దొంగలు వచ్చే వీలున్నందున, వారిని పసిగట్టి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక సమాచార కేంద్రాలు :వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలీసు సేవాదళ్ వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి షిఫ్ట్‌లో ఉండే వాలంటీర్లు నడవలేని వారిని సాయం చేస్తారు. ఆలయానికి సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమీపంలో పలు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. దాదాపు ఏడు చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నిలిపేందుకు ఆస్కారం ఉంది. భక్తుల సౌకర్యార్థం వివిధ చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో రద్దీ ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చు. పరిస్థితిని బట్టి దర్శనానికి వెళ్లొచ్చు. దీంతో అనవసర రద్దీ తగ్గే వీలుందని అంచనా వేస్తున్నారు.
శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం ? అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా - Dasara Celebration Arrangements
దుర్గ గుడి అభివృద్ధి పనుల పరిశీలన : దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ నియమించిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. దుర్గ గుడి ఘాట్ రోడ్డు వద్ద రిటైనింగ్ గోడ నిర్మాణం, ఘాట్ రోడ్డులో రాక్ మిట్‌గేషన్ పనులు, మల్లేశ్వరాలయం మెట్ల వద్ద నిర్మించిన ఫుట్ బ్రిడ్జి, అన్నదానం, ప్రసాదాల పోటు నిర్మాణ పనులను విశ్రాంత ఇంజినీర్ కొండలరావు పర్యవేక్షణలోని బృందం పరిశీలించి పలు సూచనలు చేసింది. రాక్ మిట్‌గేషన్ పనులు దసరా ఏర్పాట్లకు ఆటంకం కలగకుండా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి, వైకుంఠరావు, రమేష్ సీఈ శేఖర్, విశ్రాంత ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.