Crop Loss to Farmer in AP :సత్యసాయి జిల్లాలో ఇటీవల కురిసిన కుండపోత వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట వరదకు దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఉప్పొంగిన వాగులోని నీరు రోడ్లపై ఆరబెట్టిన వేరుశనగ పంటను ముంచెత్తిందని కోతకు సిద్ధమైన వరి నేలకు వాలి మొలకలు వచ్చాయని కర్షకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
పంటలను వరద ముంచెత్తింది :జిల్లాలో రికార్డు స్థాయి వర్షంతో అనేక చోట్ల పంటలను వరద ముంచెత్తింది. వరి, వేరుశనగ పంటలను సాగుచేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. అనేక గ్రామాల్లో వేరుశెనగ కోతలకు రైతులు కూలీలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఒక్క రాత్రిలో కురిసిన వర్షం వారిని భారీగా దెబ్బతీసింది. కొన్నిచోట్ల వేరుశనగ పీకి పొలాల్లోనే ఉంచగా వాగులు, వంకల నుంచి వచ్చిన భారీ ప్రవాహం పంటను పూర్తిగా ఊడ్చేసింది. తరువాత వరద తగ్గుముఖం పట్టడంతో పొలాల వద్దకు చేరుకున్న రైతులు జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరిపైరు నేలకొరిగింది :కర్ణాటకలో కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కనేకళ్ మండలాల్లో వేదవతి, హగరి నదులకు పోటెత్తిన వరద పంటలను పూర్తిగా ముంచెత్తింది. వరద ప్రవాహానికి వరిపైరంతా నేలవాలి మొలకలొచ్చాయి. మడకశిర నియోజకవర్గంలోని సరిహద్దు మండలాల్లోని వేరుశనగ, తమలపాకు, నర్శరీ దశలో ఉన్న వక్కతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలంలో కోసి కుప్పవేసిన వేరుశనగ మొలకలొచ్చి పనికిరాకుండా పోయిందని సాగుదారులు వాపోయారు.
''నాకు రెండు ఎకరాల పొలం ఉంది. పంట చేతికొచ్చి మరో రెండు రోజుల్లో కోతలు ప్రారంభిస్తామనగా ఇలా జరగడం చాలా బాధగా ఉంది''- మారుతి, రైతు