Heavy Rains in Andhra Pradesh: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అదే విధంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు.
CM Chandrababu on Heavy Rains: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని, అన్ని శాఖలు అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని అన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్‌కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
మంత్రి నారాయణ ఆదేశాలు: విజయవాడలో వర్షంపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ, వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రెయినేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.