Heavy Rains in Andhra Pradesh: అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని అల్లూరు, ఇందుకూరుపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమవ్వగా, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు నగరంలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. విజయవాడలో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో, ఇతర పనుల మీద బయటకు వెళ్లిన వాళ్లు అసౌకర్యానికి గురయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 4వ డివిజన్‌లోని హరిజనవాడలో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లాలో కొండ వాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీలుగుమిల్లి, రౌతుగూడెం, వంకావారిగూడెం, దర్భగూడెం, పూచికపాడు కాల్వలు రోడ్లపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాటి ఆకులగూడెం, రౌతుగూడెం వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు జీలుగుమిల్లి వాగు ప్రవాహాన్ని పరిశీలించారు.
వేలేరుపాడు మండలం కోయ మాదారం వద్ద కారుతోపాటు కొట్టుకుపోయిన ఐదుగురిని గ్రామస్తులు రక్షించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. రహదారి కొట్టుకుపోయిన బురుగులంక రేవును ఆయన పరిశీలించారు. లంక గ్రామాల ప్రజల కోసం మరబోట్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అమలాపురం రూరల్ పరిధిలోని అయినాపురం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయింది. ఇంటికి వెళ్లేటప్పుడు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - AP Weather Update
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరంతోపాటు రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో జోరుగా వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. డ్రైనేజీ కాల్వలు నిండుగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో లోతట్టు ప్రాంతాలను వాననీరు ముంచెత్తింది.