ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్పపీడనం ఎఫెక్ట్ - పలు జిల్లాల్లో దంచికొడుతున్న వానలు - HEAVY RAINS IN AP

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Heavy Rains in AP
Heavy Rains in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 5:35 PM IST

Updated : Oct 14, 2024, 5:53 PM IST

Heavy Rains in AP : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవం అస్థవ్యస్థం అవుతోంది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావొద్దని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి సూచించారు.

AP Rains 2024 Updates :రాష్ట్రంలో వర్షం పరిస్థితిని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్​కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోదియా పర్యవేక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, ఆర్​అండ్​బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈదురుగాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాల ప్రభావంతో కాలువలు , వాగులు పొంగే రహదారులను వెంటనే మూసేయాలని ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివాసముండే వారిని సచివాలయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు : అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పద్మావతి సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, అయ్యప్ప గుడి సెంటర్ ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా నెల్లూరు జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు చెప్పారు.

ఆందోళనలో ఉద్యాన రైతులు : వైఎస్సార్ కడప జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామునుంచే వర్షాలు కురుస్తున్నాయి బద్వేల్‌లో రహదారులు జలమయమై జనజీవనం స్తంభించింది. అధికారులు ఎప్పటికప్పడూ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి ,పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు మండలాల్లోని ఉద్యాన పంట రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో తమ పంటలు ఎక్కడ దెబ్బతింటాయోనని ఆవేదనకు లోనవుతున్నారు.

ఒంగోలులో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ కర్నూల్ రోడ్డులో రహదారులపై మోకాలు లోతు ప్రవహిస్తుంది. గిద్దలూరు , మార్కాపురం, టంగుటూరు, కొండేపి, సంతనూతలపాడు తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచే వర్షం కురుస్తోంది. దీంతో పొలాలు నీటితో నిండిపోయాయి. గుండ్లకమ్మ కాలువ ప్రవాహం పెరిగింది. వర్షాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఎదురైతే జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, అధికారులంతా సెలవులు రద్దు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విడవని వర్షంతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

4 రోజుల పాటు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో అల్పపీడనం - 48 గంటల్లో మరింత బలపడే అవకాశం

Last Updated : Oct 14, 2024, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details