Heavy Rains and Floods in Alluri District:అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో వర్ష బీభత్సానికి గూడెం కొత్తవీధి మండలం అతలాకుతలమైంది. పిల్లిగడ్డ, మాదిగమల్లు, లంకపాకలు, చామగడ్డ వంతెనలు కొట్టుకుపోయాయి. 20 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడటంతో దారకొండ, గుమ్మరేవుల, దుప్పిలవాడ, సీలేరు, తడికొండ అమ్మవారి దారకొండ, గాలికొండ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోలాపుట్, బుంగాపుట్, లక్ష్మీపురం, బరడ పంచాయతీల్లో వంతెనలు దెబ్బతిన్నాయి.
జోలాపుట్ జలాశయం నుంచి 50వేల క్యూసెక్కులు నీరు విడుదల చేయడంతో వంతెన కొట్టుకుపోయింది. విషయం తెలిసుకున్న అరకు టీడీపీ ఇన్‌ఛార్జ్ దొన్ను దొర కోతకు గురైన ప్రాంతాన్ని గ్రావెల్ మట్టితో కప్పించి పాదచారులు వెళ్లేలా మార్గం సుగమం చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట: జిల్లా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జీకే మండలం, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచింగిపుట్టు, పాడేరు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట కొట్టుకుపోవడంతో గిరిజనులకు నష్టం వాటిల్లింది. చట్రాయిపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.