Impact of Heavy Rains in Telangana 2024: కుండపోత వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలన్ గొందిలో వరద ధాటికి లో లెవల్ వంతెన కొట్టుకుపోయింది. రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. జిల్లా పాలనాధికారి వెంకటేశ్ దోత్రే ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉరకలెత్తుతున్న పెన్‌గంగ నదిని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. లో లెవల్ వంతెనపై నీరు పారుతున్నందున గ్రామస్థులు ప్రయాణాలు చేయొద్దని సూచించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదించాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవార్గ గ్రామంలో భూమేశ్‌కు చెందిన ఇల్లు కూలిపోయింది. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామం వద్ద సరస్వతీ కాలువకు గండి పడింది. వరద సమీపంలోని పంట పొలాలను ముంచెత్తింది.
లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తగా, మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. బోధన్ నియోజకవర్గంలోని గోదావరి, మంజీరా నదులతో పాటు పసుపు వాగు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి.
నిజామాబాద్ నగరంలో కాలనీలను వరద ముంచెత్తింది. అయోధ్య నగర్, ముభారక్ నగర్, ఆర్సపల్లి, ఆర్యనగర్, శభరి మాత ఆశ్రమం, దుబ్బ కాలనీల జనం అవస్థలు పడ్డారు. ఇళ్లలోకి కప్పలు, పాములు, తేళ్లు వస్తున్నాయని వాపోయారు. సిరికొండ -కొండూరు మధ్య వాగులో బైక్‌తో సహా పడ్డ వ్యక్తి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకుచేరాడు. కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Telangana Flood Crisis 2024 : సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి అండర్ పాస్ వద్ద భారీగా నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మెదక్ - కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం డ్యాం నిండుకుండలా మారింది. జల సోయగం చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్‌లో పెద్ద చెరువు కట్టకు భారీ గండి పడింది. ఫలితంగా చెరువు కింద వందెకరాల్లో వరి పొలాలు నీటి మునిగాయి. పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి, బొక్కల వాగు, కమాన్‌పూర్‌లోని గుండారం చెరువు జలకళను సంతరించుకున్నాయి.