Heavy Rains Lash in Telangana : తెలంగాణలో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. దీంతో పాదచారులు, ప్రయాణికులు, వాహనదారులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. స్కూల్స్, కాలేజీలు విడిచిపెట్టే సమయం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని సికింద్రాబాద్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్ ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, చిలుకానగర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షమే పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. వాహనదారులు వర్షపు నీటితో ఇబ్బందులు పడ్డారు.
అలాగే ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్ అడిక్‌మెట్, రాంనగర్, గాంధీనగర్, జవహర్‌నగర్, కవాడీ గూడ, దోమలగూడ, బోలకపూర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, చైతన్యపురి, మలక్‌పేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగానే వర్షం పడి స్థానికులు ఇబ్బంది పడ్డారు. శుక్రవారం రాత్రి కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షం పడి రోడ్లు జలమయం అయ్యాయి. కొన్ని ఇళ్లల్లోకి సైతం నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. రాత్రి పడుకునే సమయంలో వర్షం కురవడంతో పనులు నిమిత్తం బయటకు వెళ్లినవాళ్లు పూర్తిగా వర్షానికి తడిసిపోయారు.
ఖైరతాబాద్‌లో అత్యధిక వర్షపాతం : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షానికి అత్యధికంగా ఖైరతాబాద్‌లో 7.9 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. గోల్కొండలో 7.3, అసిఫ్‌నగర్‌లో 7.1 సెం.మీ., మెహిదీపట్నం 6.4, సికింద్రాబాద్‌లో 5.8 సెం.మీ., నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 5 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.