HEAVY RAIN ALERT: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ఇది తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. అనంతరం కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ (India Meteorological Department ) పేర్కొంది.
నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయమని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతాన్ని కుదిపేస్తున్న వరుస అల్పపీడనాలు:బంగాళాఖాతాన్ని వరుస అల్ప పీడనాలు కుదిపేస్తున్నాయి. సాధారణంగా రుతుపవనాలు బలంగా ఉన్నప్పుడు సముద్రంలో అల్ప పీడనాలు ఏర్పడతాయి. ఈ ఏడాది నైరుతి ఈశాన్య రెండు రుతుపవనాలు బలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఎక్కువ అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడిన తరువాత సముద్ర, భూ ఉష్ణోగ్రతలు అనుకూలిస్తే వాయుగుండంగా అటుపై తుపానుగా మారుతున్నాయి.
కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో దానా, ఫెయింజిల్ తుఫానులు ఏర్పడ్డాయి. ఇక సుమారు ఆరు అల్ప పీడనాలు అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వరం వరకు ఏర్పడ్డాయి. కానీ వాతావరణ పరిస్థితులు మార్పు వల్ల అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో కోస్తా ప్రాంతంలో వాయుగుండాలు, తుపానులు తీరందాటాయని, ఇక నవంబర్-డిసెంబర్ నెలలో తమిళనాడు సమీపంలో తీరం దాటతాయని పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల వల్ల చాలా వరకు కోస్తా ప్రాంతంలో తీరం దాటవలసిన తుపానులు తమిళనాడు దగ్గర, తమిళ నాడు తీరంలో దాటవలిసిన సమయంలో ఉత్తర, దక్షిణ కోస్తాల దగ్గర తీరం దాటుతున్నట్లు వాతావరణ నిపుణులు ఆచార్య భానుకుమార్ తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల సముద్రంలో ఏర్పడిన తుపానులు, వాయుగుండాలు తీరం దాటే అంశంలో తీర ప్రదేశాన్ని మార్పు చేసుకుంటున్నాయని, ఇది ఇబ్బంది కలిగించే చర్య అని అన్నారు. ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
అల్పపీడనం ఎఫెక్ట్ - మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన