Heavy Flood Water Flow To Telangana Water Projects :తెలంగాణరాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు వంకలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలతో పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం 20 అడుగులు ఉండగా ప్రస్తుతం 25 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది.
పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD
ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఎగువన వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59 వేల 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరింది.
త్రివేణి సంగమం వద్ద జలకళ : నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1065.7 అడుగులుగా ఉంది. మొత్తం నీటినిల్వ సామర్థ్యం 16.405 టీఎంసీలు అయితే వరద నీరు చేరినందుకు 80.5 టీఎంసీలుగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. త్రివేణి సంగమం వద్ద ఉద్ధృతంగా గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద 7 మీటర్ల పైగా ఎత్తులో వరద కొనసాగుతుంది.