Hyderabad Govt Schools :ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్లు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు ప్రధానోపాధ్యాయులు మాత్రం ఈ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, పరీక్షలు రాసి ఫెయిలైతే తమపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న భావనతో ఒత్తిడిని తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మొన్న నిర్వహించిన ఎస్-1 పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఓపెన్ స్కూల్‌లో పరీక్షలు రాయాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఓపెన్ స్కూల్ నిర్వాహకులతో సైతం మాట్లాడుతున్నారు.
హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓపెన్ స్కూల్‌లో నలుగురు హైదరాబాద్ విద్యార్థులు ఉండటంతో వారిని ఈనాడు-ఈటీవీ భారత్ ప్రతినిధి పలకరించగా ఈ బాగోతం వెలుగుచూసింది. ఈ విషయాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టికి తీసుకెళ్లగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నగరంలోని నాంపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బేగంబజార్, గన్‌ఫౌండ్రీకి చెందిన నలుగురు విద్యార్థులు తొమ్మిదో తరగతి వరకు చదివారు. పదో తరగతికి వచ్చేసరికి నామినల్ రోల్స్‌ను పాఠశాల విద్యా సంచాలకుడి కార్యాలయానికి పంపే ముందు వారి తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ చదివితే మీ పిల్లలు ఫెయిల్ అవుతారని చెప్పి టీసీలు ఇచ్చి పంపించేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలోని ఓపెన్ స్కూల్ నుంచి పదో తరగతి పరీక్షలు రాయించాలని సూచిస్తూ అతి సులభంగా సిలబస్ ఉంటుందని వారిని నమ్మించారు. ఇదే తరహాలో షేక్‌పేట మండలంలోని ఓ పాఠశాలలో తొమ్మిది మందికి అక్కడి హెచ్‌ఎం టీసీలు ఇచ్చి పంపించేశారంట.