Harsh Punishments For Sexual Assault In AP :సోషల్ మీడియా ప్రభావం, మద్యం, గంజాయి మత్తులో యువత పెడదారి పడుతున్నారు. తమలోని క్రూర ప్రవర్తనతో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. ఈ తరహా నేరాలకు 25 సంవత్సరాల వరకు శిక్ష పడుతుండటంతో నేరస్థులు జీవితాంతం జైళ్లలో మగ్గిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలోని పోక్సో కోర్టు పరిధిలో గత నెలలో నలుగురికి శిక్ష విధించగా, అందరూ యువకులే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లైంగిక నేరాలు, వాటి పర్యవసనాలపై యువత అవగాహన పెంచుకుని, నేర ప్రవృత్తిని వీడాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
పిల్లలపై పర్యవేక్షణ :పిల్లలపై పర్యవేక్షణ కొరవడి విశాఖపట్నంలో కొన్ని సంవత్సరాలుగా బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ ఐదు సంవత్సరాలు పాలనలో 163కు పైగా పోక్సో కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఎక్కువ మంది నిందితులు పేదలు, రోజు కూలీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. పేద, మధ్య తరగతి వర్గాల్లో కుటుంబ పోషణకు తల్లిదండ్రులిద్దరూ కూలి పనులు లేదా ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని కుటుంబాల్లో పిల్లలపై పర్యవేక్షణ కొరవడుతుంది. ఇదే అదనుగా యువత మత్తు పదార్థాలు, ఆన్‌లైన్‌లో హింసాత్మక గేమ్‌లు, అసభ్యకర వీడియోలకు ఆకర్శితులై నేరాలకు తెగిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
వరంగల్‌లో ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం - Gang Rape On Pharmacy Student
మైనర్లపై అత్యాచారం :పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అరవింద్ (26) కుటుంబంతో కలసి చినముషిడివాడలో ఉండేవాడు. పెందుర్తికి చెందిన ఓ మహిళతో అతడి భార్యకు స్నేహం ఏర్పడింది. అనంతరం వారి ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు జరిగుతుండేవి. ఆ మహిళకు ఇద్దరు కుమార్తెలు కాగా 2019 నవంబరులో అరవింద్ వారిని తీసుకుని ఒంగోలు వెళ్లిపోయాడు. ఆ సమయంలో పెద్దమ్మాయి (15), చిన్నమ్మాయి (13)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత అక్టోబరులో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించారు.
తీవ్రంగా కొట్టి, అత్యాచారం :తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుడ్ల వెంకట రమణ (27) కూలి పని చేసుకుంటూ పెదగంట్యాడలో జీవనం సాగించేవాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (13)పై 2023 మార్చిలో లైంగిక దాడికి యత్నించగా ఎదురుతిరిగింది. దీంతో ఆమెను తీవ్రంగా కొట్టి, అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా పోక్సో న్యాయస్థానంలో న్యాయమూర్తి నిందితుడికి 20 సంవత్సరాల జైలు, 10 వేల రూపాయల జరిమానా విధించారు.