Haribandi Lakshmi Excellence Journey Sanagapadu to Versity Eflu VC : ఆమెది పూర్తిగా గ్రామీణ నేపథ్యం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా చదువుకోవాలన్న సంకల్పం ముందు ప్రతికూల పరిస్థితులన్నీ చిన్నబోయాయి. వివాహమైనా పుస్తకాలను వదల్లేదు. నిత్యవిద్యార్థినిగా ఉంటూ చదువుల తల్లి సరస్వతికి ప్రతిరూపంగా మారారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రతిష్ఠాత్మకమైన ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ స్థాయికి ఎదిగారు. అలుపెరగని లక్ష్మి ప్రయాణం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
Assistant Professor to Senior Professor : ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర్లోని శనగపాడులో ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు హరిబండి లక్ష్మి. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలన్న ఆమె తండ్రి కోరికను నెరవేర్చాలని నడుం బిగించారు. 10 మైళ్ల దూరంలో ఉన్న బడికి కాలువ గట్లు, పంటపొలాలు దాటుతూ అతికష్టం మీద వెళ్లేవారు. ఈమెకు ఇంగ్లిష్‌పై మక్కువ ఎక్కువ. సెలవుల్లో పిల్లలంతా ఆడుకుంటుంటే లక్ష్మి మాత్రం పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. తనను డాక్టర్‌గా చూడాలని తండ్రి అనుకున్నా మెడిసిన్లో సీటు రాకపోయేసరికి బీఎస్సీలో చేరారు. డిగ్రీ మొదటి ఏడాదిలోనే చందాపురం వాసి వెంకయ్యతో లక్ష్మికి వివాహమైంది. అయినా చదువు ఆపలేదు. భర్త ఉస్మానియాలో లెక్చరర్‌గా చేస్తుండటంతో హైదరాబాద్ వచ్చి రెడ్డి విమెన్స్ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశారు.
కారు స్టీరింగ్ తిప్పేస్తున్న మహిళలు - డ్రైవింగ్‌లో శిక్షణకు ఆసక్తి - woman driveing in visakha
ఆంగ్లంపై ఉన్న ఇష్టంతో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ చేశారు. 1984లో హైదరాబాద్ ఇఫ్లూ నుంచి పీజీ డిప్లొమా ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, ఎం.లిట్, ఆపై ట్రాన్సులేషన్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా వచ్చింది. 1995లో ఇఫ్లూలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి విద్యార్థులకు ఎంతో సులభంగా అర్థమయ్యేలా ఇంగ్లీష్ బోధించేవారు. ఓవైపు పాఠాలు చెబుతూనే విపుల మాసపత్రిక కోసం కథల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి అనువదించారు. ఈనాడు చదువు పేజీలోనూ ఐదేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఫలితంతో సంబంధం లేకుండా చిత్తశుద్ధితో పనిచేయడంలోనే అసలైన సంతృప్తి అంటున్నారు.