Harati Priority In Vijayawada Indrakeeladri Dussehra Celebration :అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ బెజవాడ దుర్గమ్మను కొలవని భక్తులు ఉండరు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వివిధ అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అలాంటి అమ్మవారికి ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పంచ హారతులను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. కుంకుమ పూజల అనంతరం అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచ హారతులు ఇస్తున్నారు.
అన్ని మంత్రాలకు మూలం ఓంకారం :సాయం సంధ్యవేళ నివేదన అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ ఓంకార హారతి ఇస్తారు. సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం, ఓంకార రూపాన్ని చూడడం వల్ల పాపాలు తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని నమ్మకం. ఓంకార హారతిని దర్శించడం వలన భక్తులకు మోక్షఫలం లభిస్తుందని ప్రతీతి.
దీర్ఘాయువును ప్రసాదించే నాగ దేవత :పంచహరతుల్లో రెండవది నాగ హారతి. దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వలన భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుందని, సర్ప దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం :ఇక అమ్మవారికి ఇచ్చే మరో హారతి నాగహారతి. అమ్మవారికి ఇచ్చే మహిమాన్వితమైన మరో హారతి పంచ హారతి.. సద్యోజాత, వామ దేవ, అఘోర, తత్పరుష, ఈశాన అనే నామములతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతి రూపం పంచ హారతి. ఈ హారతి దర్శనం వలన భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయని పంచ ప్రాణాలకు స్వాంతన కలుగుతుందని, మల్లేశ్వరస్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం.
భూమండలాన్ని రక్షించే కుంభ హారతి :పంచ హారతుల్లో నాల్గోది కుంభ హారతి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. ఈ హారతిని దర్శించడం వలన భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవరక్ష లభిస్తుందని విశ్వాసం.