GURU POURNAMI 2024 SPECIAL : ఆషాఢమాసం తొలి పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించిన రోజు! అదే వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. అందుకే ఆ రోజు విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించవచ్చు. కానీ ఆ రోజు వాళ్లను కాకుండా గురువులని పూజించడం ఎందుకు అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ రాక మానదు. అందుకు మన పెద్దలు చెప్పే కారణాలు, అంశాలు ఏమిటంటే?
వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యారు. వాటితో పాటు భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి విశేషమైంది. వ్యాసుడు అనేవాడు వీటిని రచించకపోతే హిందూ ధర్మశాస్త్రాలు అనేవి ఉండేవా? అన్న అనుమానం కొన్నిసార్లు వస్తోంది. అయితే ఇన్ని పనులూ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా! అందుకే వ్యాసుడు అనే పేరు ఒక వ్యక్తి నామం కాదనీ, వ్యాసుడు అనేది ఓ బిరుదనీ కొందరు అంటారు.
అందుకే జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా, ఏ రూపంలో ఉన్నా, వారిని వ్యాసుడని, వ్యాసమహార్షిని పిలిచేవారట. బహుశా అందుకే వ్యాసుడిని మరణం లేనివాడుగా మన పురాణాలు చెబుతున్నాయి. అలా మన జ్ఞానాన్ని రక్షించే గురువులు, తరగని జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్న వారు సాక్షాత్తూ ఆ వ్యాసుడి రూపాలు. అందకే ప్రతి వ్యాసపౌర్ణమి నాడు, మన కళ్ల ముందున్న గురువులను, పెద్దవారిని దైవ సమానులుగా భావించి పూజిస్తూ, నమస్కరిస్తూ ఉంటాం.
'గురు శిష్య సంబంధంతోనే ఉన్నత సమాజం'
దర్శించుకునేది ఎలా?: ఇక వ్యాసపౌర్ణమి రోజు గురువులను ప్రత్యేకంగా పూజించేందుకు ఓ కథ కూడా వ్యాప్తిలో ఉంది. పూర్వం వారణాసిలో ‘వేదనిధి’ అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు ‘వేదవతి’. ఆ దంపతలకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకొని, తమకు సంతానభాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతారు. వేదవతి, వేదనిధిల భక్తికి మెచ్చిన వ్యాసమహర్షీ ఆ దంపతులకు సంతానం భాగ్యం దక్కేలా ఆశీర్వదించారు.
ఆ దంపతులు వ్యాసుల వారిని విడిచివెళ్తూ ‘మేము కోరుకున్నప్పుడ్లలా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా?’ అని అడిగారు. అందుకు వ్యాసుడు ‘జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ ఉంటాననీ, అలాంటి గురువులను, తన పుట్టిన రోజైన వ్యాసపౌర్ణమినాడు పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని’ చెప్పారట. అలా ఆ రోజు నుంచి నుంచి వ్యాసపౌర్ణమినాడు గురువులను ఆ వ్యాసభగవానుగా తలచి కొలుచుకునే ఆచారం నడుస్తోంది.
దక్షిణామూర్తిగా శివుడు రూపాంతరం:గురుశిష్యుల ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీకగా కూడా వ్యాసపౌర్ణమికి చాలా ఘటనలు చెబుతారు. బుద్ధుడు భోదివృక్షం కింద జ్ఞానోదయం సమపార్జించిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది కూడా గురుపౌర్ణమి ఈ రోజునే అని మరో కథనం వ్యాప్తిలో ఉంది. దక్షిణామూర్తిగా శివుడు రూపాంతరం చెంది సప్తర్షులకు ఉపదేశం చేసిందీ కూడా ఈ రోజునే అన్న ఇంకో కథనం! జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు, తన ముఖ్యశిష్యుని ఎన్నుకొన్నది కూడా గురుపౌర్ణమి నాడే అని కూడా చెబుతారు!