Tension in Guntur Muncipal Corporation Council Metting :గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాలక మండలి సమావేశం సందర్భంగా డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నగరపాలక సంస్థ ఆదాయ, వ్యయాలు చర్చించే సమయంలో అధికారులు తమాషాలు చేస్తున్నారా? అంటూ బాల వజ్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యంతరం చెప్పారు. తమాషాలు చేయడం ఏంటని డిప్యూటీ మేయర్ ను గట్టిగా నిలదీశారు. అయనప్పటికీ డిప్యూటీ మేయర్ తన వాదనను కొనసాగించడంతో కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు.
ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిషనర్:గుంటూరు నగరపాలక సంస్థ సమావేశంలో డిప్యూటి మేయర్ బాలవజ్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అధికారుల్ని, ఉద్యోగుల్ని బెదిరించేలా డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఆరోపించారు. తప్పనిసరిగా దీనిపై చర్యలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎంతో ఓపికగా సమాధానం చెబుతున్నప్పటికీ అవమానించేలా బాలవజ్రబాబు మాట్లాడారని తన ఆవేదనను వెలిబుచ్చారు.డిప్యూటీ మేయర్ తీరు సరిగా లేదని అందుకే వెళ్లిపోతున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడికి చెప్పి బాయ్‌కాట్ చేశారు. అధికారులు సైతం కమిషనర్ వెంటే బయటకు నడిచారు. దీంతో సమావేశాన్ని అర గంట వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు
క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘాల డిమాండ్: గుంటూరు డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు వెంటనే కమిషనర్ కు క్షమాపణ చెప్పాలని ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బాల వజ్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే డిప్యూటీ మేయర్ కమిషనర్ కు క్షమాపణలు చెప్పాలన్నారు. బాల వజ్రబాబు ప్రతిసారి ఉద్యోగులను ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.