తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాట్‌' ఎగ్జామ్​కు సిద్ధమయ్యారా ? - పరీక్ష రాసే ముందు ఇవి తెలుసుకోండి ! - INSTRUCTIONS FOR CAT EXAM

దేశవ్యాప్తంగా నవంబర్‌ 24న జరగనున్న కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ 2024 - ఎన్నో నెలలుగా సన్నద్ధమవుతున్న విద్యార్థులు తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలో చూద్దాం

INSTRUCTIONS FOR CAT EXAM
Guidelines for Common Admission Test Candidates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2024, 7:17 PM IST

Guidelines for Common Admission Test Candidates : దేశవ్యాప్తంగా నవంబర్​ 24న కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్​)- 2024 పరీక్ష జరగబోతోంది. ఐఐఎంల్లో, ఎన్నో టాప్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ ప్రవేశాలకు విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ పరీక్ష కోసం ఎన్నో నెలలు సమయాన్ని వెచ్చించిన విద్యార్థులు తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలో తెలుసుకుందాం. నవంబర్‌ 12న ఐఐఎం కలకత్తా క్యాట్‌ వెబ్‌సైట్‌లో మాక్‌ క్యాట్​ను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ పరీక్ష రాయాలి. మాక్‌ క్యాట్ ప్రకారం డేటా ఇంటర్‌ప్రెటేషన్‌- లాజికల్‌ రీజినింగ్‌లో 22 ప్రశ్నలున్నాయి.

గత సంవత్సరం ఈ విభాగంలో 20 ప్రశ్నలు వచ్చాయి. వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో సెంటెన్స్‌ కంప్లీషన్‌ క్వశ్చన్స్​ లేవు. అభ్యర్థులు ఈ మార్పులను గమనించాలి. మాక్‌ టెస్ట్‌ ప్రకారమే క్యాట్‌ 2024 పరీక్ష ఉంటుందని చెప్పలేం. కానీ క్యాట్​ సిలబస్​లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. క్యాట్‌లో విజయం సాధించాలంటే అన్నీ ప్రశ్నలూ ఛేదించాల్సిన అవసరం లేదన్న నిజం తెలుసుకుంటే ఒత్తడి ఉండదు. ప్రశ్నపత్రంలో 40 శాతం ప్రశ్నలకు సరిగ్గా జవాబు ఇస్తే చాలు. సిలబస్, ప్రశ్నల గురించి చింతించాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఆందోళన పడకూడదు.

ఏ ప్రశ్నలు ఎంచుకోవాలి ? :ఈ పరీక్షలో సమయ పాలన పాటించడం ముఖ్యమైన నియమం. ప్రతి విభాగంలో ప్రశ్నలు ఎంచుకోవడం కన్నా, ఏ ప్రశ్నలు వదిలివేయాలన్నదే అవసరం. కఠినంగా ఉండే ప్రశ్నలతో కాకుండా సులభమైన ప్రశ్నలనే మొదట పూర్తి చేసి తర్వాత మిగిలిన సమయంలో కష్టమైన ప్రశ్నలకు సమయం కేటాయించడం మంచిది.

వెర్బల్‌ ఎబిలిటీ- రీడింగ్‌ కాంప్రహెన్షన్‌

వెర్బల్‌ ఎబిలిటీ- రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో చాప్టర్‌ వారీగా సిలబస్‌ లేదు. అన్ని జవాబులు ప్యాసేజీలోనే ఉంటాయి. అందుకు వాటిని వెతికి పట్టుకునే నైపుణ్యం ఉంటే చాలు. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో నాలుగు ప్యాసేజీలు అందులోని 16 ప్రశ్నలు, ఎబిలిటీలో 8 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలకు చూసి 4 ప్యాసేజీల్లో అనుకూలమైన రెండింటిని మొదట ఛేదించాలి. తర్వాత మూడో ప్యాసేజీపై నిర్ణయం తీసుకోవాలి. వెర్బల్‌ ఎబిలిటీలో మంచి స్కోరు తెచ్చుకుంటే రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ఒత్తిడి తగ్గుతుంది.గతేడాది 8 ప్రశ్నలకు నెగటివ్‌ మార్కింగ్‌ లేకుండా 90 పర్సంటైల్‌ వచ్చింది.

డేటా ఇంటర్‌ ప్రెటేషన్‌- లాజికల్‌ రీజనింగ్‌

డేటా ఇంటర్‌ ప్రెటేషన్‌- లాజికల్‌ రీజనింగ్​లో నాలుగైదు సెట్స్​ రూపంలో ప్రశ్నలు ఇస్తున్నారు. తొలుత అన్నీ సెట్స్​నూ పరిశీలించి వాటిలో సులువుగా ఉండేవాటిని మొదట పూర్తి చేయాలి. డేటా చదివేటప్పుడు క్లుప్తంగా సమాచారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సారి 7 సరైన ప్రశ్నలను (నెగటివ్‌ మార్కింగ్‌ లేకుండా) చేస్తే 90 పర్సంటైల్‌ రావొచ్చు.

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీలో అరిథ్‌మెటిక్‌ (8 ప్రశ్నలు), ఆల్జీబ్రా (8 ప్రశ్నలు) నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. నాన్‌-మ్యాథ్స్‌ అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ప్రశ్నలు నిత్య జీవతంలో ఉపయోగించే అంక గణితం నుంచే వస్తున్నాయి. ఒక్కొక్క ప్రశ్నపై 3-4 నిమిషాల కన్నా ఎక్కువ సమయం కేటాయించకుండా ఈ విభాగాన్ని ముగించాలి. గతేడాది ఇందులోమార్కింగ్‌ లేకుండా కేవలం 6 ప్రశ్నలకే 90 పర్సంటైల్‌ వచ్చింది.

పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పరీక్ష ముందు రోజుగానీ పరీక్షరోజుగానీ కొత్తగా ఏమీ చదవకుండా ప్రశాంతంగా ఉండాలి. ఫ్యామిలీతో గడపడం, ఆటలు ఆడటం, కొద్దిసేపు సరదాగా సేద తీరాలి.
  • పరీక్ష రోజు లైట్​ ఫుడ్​ తీసుకోవాలి. కానీ ఏమీ తినకుండా పరిగడుపుతో వెళ్లకూడదు.
  • పరీక్ష ముందు రోజు రాత్రి బాగా నిద్రపోవడం తప్పనిసరి.
  • పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకుంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు. ముందు రోజే కేంద్రం చిరునామా తెలుసుకోవాలి.
  • క్యాట్‌ అడ్మిట్‌ కార్డుతోపాటు ఫ్రువ్​ ఐడీ ఆధార్‌ లాంటివి తీసుకెళ్లాలి. క్యాట్‌ దరఖాస్తులో అప్‌లోడ్‌ చేసిన ఫొటో లాంటిదే అడ్మిట్‌ కార్డుపై అతికించి తీసుకెళ్లాలి. అదనంగా మరో రెండు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలు తీసుకెళితే మంచిది. రెండు అడ్మిట్​ కార్డు ప్రింట్ కాపీలు ముందు రోజే తీసుకోవాలి.
  • కొందరు ప్రత్యేక విద్యార్థులకు స్క్రైబ్‌లకు అఫిడవిట్‌, మెడికల్‌ సర్టిఫికెట్ లాంటివి అవసరమవుతాయి. క్యాట్‌ వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలకు అనుగుణమైన పత్రాలు తీసుకెళ్లాలి.
  • పరీక్ష కేంద్రంలో ఎగ్జామినర్‌ సూచనలతోపాటు మొదటి పేజీ ‘పరీక్ష సూచనలను’ కూడా చదివి పరీక్ష మొదలుపెట్టాలి.

CAT​ పరీక్షకు మిగిలింది 3 వారాలే - ఈ స్టడీ ప్లాన్ ​అనుసరిస్తే మంచి స్కోరు పక్కా!

ABOUT THE AUTHOR

...view details