Gudlavalleru Engineering College Issue: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల వసతి గృహంలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ జరిగిన ప్రచారంతో కలకలం రేగింది. మూడు రోజుల కిందట కొంతమంది విద్యార్థినులు ఇదే అనుమానంతో వార్డెన్ పద్మావతికి ఫిర్యాదు చేశారు. ఆమె విద్యార్థినులపైనే కేకలు వేయడంతో వారంతా మౌనంగా ఉన్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల్లో ప్రచారం జరిగి సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
గురువారం కొందరు విద్యార్థులు కళాశాల పర్యవేక్షణాధికారికి ఫిర్యాదు చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి అదే కళాశాలలో మరో విద్యార్థిని ప్రేమలో ఉన్నారని వారి ద్వారా విషయం తెలిసిందని చెప్పారు. దీంతో ఆ పర్యవేక్షణాధికారి వారిద్దరినీ పిలిచి వారి ఫోన్లను పరిశీలించి చిన్న విషయంగా తీసుకుని పంపించి వేశారు. దీనిపై కలత చెందిన విద్యార్థినులు గురువారం రాత్రి పది గంటలకు వసతి గృహం నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.
విద్యార్థినుల నిరసనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం ఆదేశంతో జిల్లా యంత్రాంగం కదిలింది. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్లర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ హుటాహుటిన కాలేజీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మహిళా సీఐ ఆధ్వర్యంలో సాంకేతిక బృందాన్ని విచారణకు నియమించారు. విద్యార్థినుల ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ పద్మావతిపై చర్యలకు ఆదేశించారు. వసతి గృహంలో రహస్య కెమెరాలు లేవని ధ్రువీకరిస్తేనే తాము లోపలికి వెళ్తామని విద్యార్థినులు బయటే ఉండిపోయారు. దీంతో బాంబ్ స్వ్కాడ్, ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించే పరికరాలతో పోలీసులు సోదాలు చేశారు.