తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష - ఎగ్జామ్ హాల్​లోకి అభ్యర్థులకు అనుమతి

నేటి నుంచి ఈ నెల 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ - హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు - కేంద్రాల వద్ద 163 సెక్షన్​తోపాటు భారీ బందోబస్తు - నిబంధనలు ఇవే

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Updated : 33 minutes ago

GROUP 1 MAINS EXAM INSTRUCTIONS
TGPSC Group one mains Starts From Today (ETV Bharat)

TGPSC Group-1 Mains Exams From Today :రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం నేడు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ఇవాళ (సోమవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తున్నారు.

ఒకటిన్నర తర్వాత ఏ ఒక్కరినీ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు.

163 సెక్షన్ విధించడంతో పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్‌ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎగ్జామ్​ రూం, పరిసర ప్రాంతాలను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించనున్నారు. పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను జీపీఎస్‌ ట్రాకింగ్​ అమర్చిన వాహనాల్లో తరలించనున్నారు. దీంతో నిర్దేశిత మార్గాల్లోనే ఆ వాహనాలు ప్రయాణించేలా రూట్​మ్యాప్​ సిద్ధం చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిబంధనలు ఇవే

  • గ్రూప్​- 1 అభ్యర్థులను డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌(డీఎఫ్‌ఎండీ)లతో తనిఖీ చేశాకే పరీక్షకు అనుమతించనున్నారు.
  • హాల్​టికెట్​లో పేర్కొన్న సూచనలు పాటించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
  • హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలను తుది నియామకాలు పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించింది.
  • ఇన్విజిలేటర్లు సైతం కచ్చితంగా పాటించాలంటూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
  • అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్‌ రంగు బాల్‌పాయింట్‌ పెన్, పెన్సిల్, రబ్బరు, హాల్‌టికెట్ తెచ్చుకోవాలి.
  • ప్రభుత్వం జారీ చేసిన ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలి. బొమ్మలు పెన్సిల్‌ లేదా పెన్‌తో వేయాలి. జెల్, స్కెచ్‌పెన్‌లు వంటివి వాడకూడదు.
  • తొలిరోజు నుంచి చివరి రోజు వరకు ఒకే హాల్‌టికెట్‌ను మాత్రమే ఉపయోగించాలి.
  • హాల్‌టికెట్‌ మార్చి తీసుకొస్తే అనుమతించరు.
  • హాల్‌టికెట్‌పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితోపాటు ఇన్విజిలేటర్‌ కూడా సంతకం చేయాలి.
  • జవాబులు రాసేందుకు ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇస్తారు. అదనపు పత్రాలు ఇవ్వరు.
  • అభ్యర్థి ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్ ​(జనరల్‌ ఇంగ్లిష్‌ మినహా)లోనే ఆన్సర్స్​ రాయాలి.
  • వేర్వేరు భాషలో రాస్తే ఆ జవాబుపత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా ప్రకటిస్తుంది.
  • దివ్యాంగ అభ్యర్థుల హాల్‌ టికెట్లపై స్క్రైబ్‌ (పరీక్ష రాయడానికి సహాయకులు) విషయాన్ని ప్రత్యేకంగా వివరించడంతోపాటు వీరి కోసం ప్రత్యేకంగా నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా గంట సమయాన్ని కేటాయిస్తారు. వీరు సదరం ధ్రువపత్రం తీసుకురావాలి.

పోలీసుల నిఘా నీడలో 'మెయిన్స్' - తొలిసారి జీపీఎస్ ట్రాకింగ్ విధానం అమలు

Last Updated : 33 minutes ago

ABOUT THE AUTHOR

...view details