GreenCo Company Environmental destruction in Kurnool District :పర్యావరణహితం అని చెప్పుకునే ఆ కంపెనీ పర్యావరణ విధ్వంసానికి తెగించింది. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ పేరుతో అటవీ భూముల్ని నాశనం చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూములకు పక్కనే ఉన్న అటవీ భూముల్ని కలిపేసుకుంది. అడవుల్లో భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఎవరినీ రానీయకుండా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది.
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు :ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో గ్రీన్-కో సంస్థ ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీని కోసం గుమ్మితం తాండా, పిన్నాపురం గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టింది. 2022 మే 17న అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 5 వేల 410 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని అడవుల విధ్వంసానికి తెగపడ్డారు. అటవీశాఖ అనుమతులు తీసుకోకుండానే రోడ్లు వేశారు. కొండల్ని తవ్వేసి గుళ్లచేశారు. ప్రాజెక్టు పనులు చేసే కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లు వేశారు. యంత్రసామాగ్రి నిలిపేందుకు నిర్మించిన తాత్కాలిక గ్యారేజీలకూ అటవీశాఖ నుంచి అనుమతి లేదు. ఇదే విషయాన్ని కర్నూలు అటవీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
వైఎస్సార్సీపీ నాయకుడు అండతో :గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రిన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ గత తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రానికి వచ్చింది. 2019లోనే నాటి ప్రభుత్వం 903 ఎకరాల్ని ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయీంచింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ గత ప్రభుత్వం కేటాయించిన భూములు సరిపోకపోతే అదనంగా భూమి కావాలని ప్రభుత్వానికి సవివరంగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రీన్ కో అలాంటిదేమీ చేయకుండానే అటవీ భూమిని యథేచ్ఛగా వాడుకుంటోంది! దీనికి కారణం గ్రీన్ కో ఎండీ, సీఈవో అనిల్ సోదరుడు చలమలశెట్టి సునీల్ వైఎస్సార్సీపీ నాయకుడు కావడమే.